కొనసాగుతున్న ‘మహా’ ప్రతిష్టంభన

Dec 3,2024 08:19 #ongoing 'major' standoff

న్యూఢిల్లీ/ముంబయి : మరాఠా పీఠంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన సోమవారం పదో రోజుకు చేరింది. బుధవారం జరిగే పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజరు రూపానీని బిజెపి అధిష్టానం ముంబయి పంపుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే తన షెడ్యూల్‌ సమావేశాలను రద్దు చేసుకున్నారు. మరో కీలక నేత, ఎన్‌సిపి అధినేత అజిత్‌ పవార్‌ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై, మంత్రుల శాఖలపై బిజెపి నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న బిజెపి సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండేకు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్‌ పేరు ఖరారైందని బిజెపి సీనియర్‌ నేత ఒకరు పిటిఐ వార్తాసంస్థకు తెలిపారు. ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో ఈ నెల ఐదవ తేదీన ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవన్‌కులే ప్రకటించారు. ఏక్‌నాథ్‌ షిండే గొంతు ఇన్‌ఫెక్షన్‌, జ్వరంతో బాధపడుతుండడంతో సోమవారం జరగాల్సిన మహాయుతి నేతల భేటీ వాయిదా పడింది. ఆయన ఇంకా సతారాలోని తన స్వగ్రామంలోనే ఉన్నారు. మహాయుతి నేతలు మంగళవారం సమావేశమై మంత్రుల శాఖల కేటాయింపుపై ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్‌ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే తోసిపుచ్చారు. ఈ వార్తలు నిరాధారమని అంటూ మంత్రి పదవికి తాను పోటీలో లేనని స్పష్టం చేశారు.

➡️