పర్భనిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

Dec 13,2024 00:45 #ongoing, #Parbhani, #tension
  • ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న ప్రభుత్వం
  • 40 మంది అరెస్టు

ముంబయి: మహారాష్ట్రలోని పర్భిని వద్ద రాజ్యాంగం ప్రతిమను ధ్వంసం చేసిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనేవున్నాయి. గురువారం కూడా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజ్యాంగ ప్రతిమను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం చేపట్టిన బంధ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడటంతో కొందరు వాహనాలను ధ్వంసం చేశారు. దీనిని సాకుగా చూపి బిజెపి ప్రభుత్వం 40 మంది పైగా అరెస్టు చేసింది. ఈ అరెస్టులను ఖండిస్తూ పలువురు అంబేద్కరిస్టులు మళ్లీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో పర్భనిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై ప్రభుత్వం కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వంచిత్‌ బహుజన్‌ ఆఘాడి (విబిఎ) అధ్యక్షులు ప్రకాశ్‌ అంబేద్కర్‌ విమర్శించారు. ఇప్పటికైనా రాజ్యాంగ ప్రతిమను ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రకాశ్‌ అంబేద్కర్‌ కోరారు.

➡️