న్యూఢిల్లీ: పేదలకు ఇళ్లు సమకూర్చేందుకు, శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వాల వద్ద డబ్బుల్లేవని, సైకిళ్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేయడం అవసరమా? అని సుప్రీంకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. దేశంలో సైకిళ్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అనేక రాష్ట్రాల్లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయని.. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలంటూ ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. ”ఒకసారి మురికివాడకు వెళ్లి చూడండి. వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి. కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడండి. ప్రజలకు ఇళ్లు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు లేదు. తాగేందుకు శుద్ధ జలాలు లేవు. అలాంటిది సైకిల్ ట్రాక్‌ల గురించి పగటి కలలు కంటున్నారు” అని జస్టిస్ అభరు ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ”మనం ఎలాంటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వాటిపై ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉద్దేశాన్ని గుర్తు చేసుకోండి. తాగేందుకు సరైన నీటి సౌకర్యం లేదు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. కానీ, మీకు మాత్రం సైకిల్ ట్రాక్‌లు కావాలా..?” అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
పేదలకు నీళ్లు లేవు.. నివాసాల్లేవు.. సైకిల్ ట్రాక్‌లు అవసరమా? : సుప్రీం కోర్టు
