- మోడీ-అదాని ఫేస్ మాస్క్‌లతో ఎంపీిల ఆందోళన
- రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అదాని ముడుపుల వ్యవహారంపై ప్రధాని మోడీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీిలు డిమాండ్ చేశారు. వినూత్న రీతిలో మోడీ-అదాని ఫేస్ మాస్క్‌లతో ప్రతిపక్ష పార్టీల ఎంపీిలు ఆందోళన చేపట్టారు. సోమవారం పార్లమెంట్ మకర ద్వారం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో రాజ్యసభ, లోక్‌సభల ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, డిఎంకె ఎంపి టిఆర్ బాలు, సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్, శివసేన ఎంపి సంజరు రౌత్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఎంపిలు మోడీ – అదాని ఫేస్ మాస్క్‌లు పట్టుకొని… ‘అదాని-మోడీ భారు భారు, మోడీ – ఆన్సర్ దే’ నినాదాలు చేశారు. అనంతరం మోడీ, అదాని ఫేస్ మాస్క్‌లు ధరించిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపిలను రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మాణిక్యం ఠాగూర్.. అదాని ముసుగు వేసుకోగా, శివాజీరావు అధల్ రావు పాటిల్.. మోడీ మాస్క్ వేసుకున్నారు. వీరిద్దరిని దాదాపు 69 సెకెన్లపాటు రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేశారు. దీంట్లో ‘ఆజ్ కల్ క్యా హౌ రహా హై భారు? (ఈ రోజుల్లో ఏమి జరుగుతోంది సోదరా)’ అని అదాని మాస్క్‌ను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తారు. ఇందుకు అదాని ఫేస్ మాస్క్ వేసుకున్న ఠాగూర్, మోడీ ఫేస్ మాస్క్‌తో ఉన్న పాటిల్‌పై చేయి వేసి… ‘మెయిన్ జో భీ బోల్తా హన్, యే కర్తా హై. మెయిన్ కుచ్ భీ చహ్తా హన్, పోర్ట్ చాహియే, ఎయిర్‌పోర్ట్ చాహియే (నేను ఏది చెప్పినా, అతను చేస్తారు. నాకు ఏది కావాలంటే అది. ఎయిర్‌పోర్ట్ లేదా పోర్ట్)’ అని బదులిస్తారు. మరోసారి రాహుల్ స్పందిస్తూ… ‘మీరు తదుపరి ఏమి అడుగుతున్నారు?’ అని అడగ్గా, ‘సాయంత్రం మీటింగ్ ఉంది’ అని ఠాగూర్ సమాధానం ఇస్తారు. అలాగే ‘మేము ఒకేలా ఉన్నాం. మేము ప్రతిదీ కలిసి చేస్తాం. మేం చాలా ఏళ్లుగా కలిసి ఉన్నాం’ అంటూ ఠాగూర్ అంటారు. కాగా ఇలాంటి ఇంటర్వ్యూలు రికార్డు చేసి, ప్రసారం చేయడం నిబంధనలకు విరుద్ధమని లోక్‌సభ అధికారులు తెలిపారు. కేవలం మీడియా స్టాండ్ వద్ద సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారని, కానీ చట్టసభ సభ్యులు మాక్ సెషన్‌ను రికార్డు చేయడం చట్ట విరుద్ధమైన చర్య అని అన్నారు.