ఈ పరిస్థితికి కారణం డబ్ల్యుఎఫ్‌ఐ, సంజయ్ సింగ్‌ : ఢిల్లీ హైకోర్టులో వినేశ్‌ ఫోగట్‌ న్యాయవాది

న్యూఢిల్లీ :    రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ), దాని అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ ఒలింపిక్‌ గ్రామంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ భవిష్యత్తును నాశనం చేసేలా ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆమె తరపు కౌన్సిల్‌ గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఫలితంగా భారత్‌ బంగారు పతకాన్ని కోల్పోయిందని వినేశ్‌ ఫోగట్‌ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా పేర్కొన్నారు. డబ్ల్యుఎఫ్‌ఐకి ఎన్నికైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీపై గతేడాది డిసెంబర్‌లో క్రీడాశాఖ మంత్రి సస్పెండ్‌ వేటు వేయడమే ప్రధాన కారణమని వినేశ్‌ ఫోగట్‌ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా పేర్కొన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్‌ ఫోగట్‌ అనర్హత వేటుకి గురైన సంగతి తెలిసిందే.

గతేడాది డిసెంబర్‌లో డబ్ల్యుఎఫ్‌ఐకి నిర్వహించిన ఎన్నికలు చట్టవ్యతిరేకమని, స్పోర్ట్స్‌ కోడ్‌ను పాటించనందున కమిటీని పక్కన పెట్టాలంటూ రెజ్లర్లు బజరంగ్‌పూనియా, వినేశ్‌ ఫోగట్‌ సహా పలువురు ఢిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ నిర్వహించే కార్యకలాపాలు, విధులపై స్టే విధించాలని పిల్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై మే 24న తీర్పు కోసం రిజర్వ్‌ చేయబడింది. కానీ ఇప్పటి వరకు తీర్పు వెలువడలేదు.
ఈ పిటిషన్‌పై తీర్పు వెల్లడించేందుకు తేదీని ప్రకటించాల్సిందిగా వినేశ్‌తో పాటు వారి కౌన్సిల్‌ జస్టిస్‌ సచిన్‌ దత్తాను అభ్యర్థించారు. ఇప్పుడు భారత్‌ బంగారు పతకాన్ని కోల్పోయిందని రాహుల్‌ మెహ్రా పేర్కొన్నారు. అయినప్పటికీ జడ్జి తేదీని ప్రకటించలేదు.

జస్టిస్‌ సచిన్‌ దత్తా ప్రస్తుతం జస్టిస్‌ విభు బఖ్రుతో డివిజన్‌ బెంచ్‌లో ఉన్నారు. తీర్పును ప్రకటించడానికి ప్రత్యేకంగా సింగిల్‌ జడ్జి సమావేశమవుతారు. అయితే జస్టిస్‌ దత్తా సింగిల్‌ జడ్జి. బెంచ్‌ ఉన్నప్పటికీ మార్చి నుండి రెజ్లర్ల పిటిషన్‌ను విచారించారు. చివరికి రిట్‌ పిటిషన్‌ విచారణలో ఉండగానే తీర్పు కోసం స్టే దరఖాస్తును రిజర్వ్‌ చేశారు.

రిట్‌ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ పురుషేంద్ర కౌరవ్‌ కోర్టు ఎదుట విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా డబ్ల్యుఎఫ్‌ఐ సంజయ్ సింగ్‌ ప్రతినిథిలా వ్యవహరిస్తోందని రెజ్లర్ల తరపు సీనియర్‌ న్యాయవాది మెహ్రా పేర్కొన్నారు.  డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ ప్రస్తుతం పారిస్‌ ఒలింపిక్‌ గ్రామంలో ఉన్నారని, వినేశ్‌ ఫోగట్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆయనేనని అన్నారు. ముఖ్యంగా తేదీ ఆవశ్యకత గురించి రాహుల్‌ మెహ్రా స్పష్టం చేస్తూ.. ఈ అంశం జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం, దేశం మొత్తం ఈ అంశంపై కలత చెందిందని పేర్కొన్నారు.

రిట్‌ పిటిషన్‌పై వారి అభ్యర్థనలను వారం రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని జస్టిస్‌ కౌరవ్‌ డబ్ల్యుఎఫ్‌ఐని ఆదేశించారు. వాటిపై ప్రతిస్పందన దాఖలు చేసేందుకు రెజ్లర్లకు సమయం ఇస్తామని అన్నారు.

తదుపరి విచారణను సెప్టెంబర్‌ 12కి వాయిదా వేశారు.

➡️