NEET-UG 2024 results : పరీక్షల పవిత్రత దెబ్బతింది !

మాకు సమాధానాలు కావాలి
నీట్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై సుప్రీం సీరియస్‌
కేంద్రానికి, ఎన్‌టిఎకు నోటీసులు
జులై 8కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : నీట్‌ పరీక్ష వివాదంపై సుప్రీం కోర్టు కేంద్రానికి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం లీక్‌, అవకతవకలకు సంబంధించి పెద్దయెత్తున ఫిర్యాదులు వచ్చాయి. పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహ్సనుద్దీన్‌ అమానుతులాతో కూడిన సుప్రీం వెకేషన్‌ బెంచ్‌ ఈమేరకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం పరీక్షా ప్రక్రియ పవిత్రతను దెబ్బతీసేదిగా ఉందని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, ఆయుష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్‌ పరీక్ష నిర్వహించిన రోజునే ప్రశ్నా పత్రం లీక్‌ అయినట్లు పెద్దయెత్తున ఆందోళన వ్యక్తమైంది. ఫలితాలు వెలువడిన తరువాత ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. 67 మంది విద్యార్థులు పూర్తి మార్కులతో మొదటి ర్యాంకులో నిలవడం, హర్యానాలో ఆ పరీక్షా కేంద్రాల్లో రాసిన విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడంతో విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోను తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.అయితే, అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలుపు చేయడానికి కోర్టు తిరస్కరించింది. దీనిపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వద్ద పెండింగ్‌లో వున్న పిటిషన్‌ను, శివంగి మిశ్రా, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి జులై 8న విచారిస్తామని తెలిపింది. నీట్‌ పరీక్ష మే 5న నిర్వహించగా, జూన్‌4 ఫలితాలు వెలువడ్డాయి. గ్రేస్‌ మార్కులు కలపడంలో కూడా చాలా తేడాలు వున్నాయని, వాటిల్లో లాజిక్‌ ఏమిటో బోధపడడం లేదని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కు చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. ‘పరీక్షా సమయాన్ని కొంతమేరకు కోల్పోవడం వల్లనే ఈ గ్రేస్‌ మార్కులు కలిపామని కారణం చెబుతున్నారని, ఆ పరీక్షా సమయం కోల్పోవడమేంటో ఇంతవరకు వెల్లడించలేదని వారు పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య పరిజ్ఞానానికి సంబంధించి లోతైన అవగాహన కలిగివుండాల్సిన ఇటువంటి పరీక్షల్లో మోసాలు , అక్రమాలు చోటుచేసుకుంటే దాని పర్యవసానాలు సమాజంపై దారుణంగా ఉంటాయని పిటిషనర్లు పేర్కొన్నారు.ది.

➡️