- రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు, ఒడిషా, పశ్చిమ బెంగాల్, హర్యానా ఒక్కొస్థానం చొప్పున మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మూడు స్థానాలు కూడా టిడిపి కూటమి ఖాతాలోని పడనున్నాయి. వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. షెడ్యూలు ప్రకారం.. రాజ్యసభ ఉప ఎన్నికలకు డిసెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు డిసెంబరు 10 వరకు ఉంది. డిసెంబరు 11న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబరు 13 తుది గడువు అని షెడ్యూల్‌లో ఇసి పేర్కొంది. డిసెంబరు 20న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మోపిదేవి వెంటరమణ పదవీ కాలం 2026 జూన్ 21 వరకు ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పదవీ కాలం 2028 జూన్ 21 వరకు ఉంది. దాదాపు ఏడాన్నర పాటు పదవీకాలం ఉంటుండగానే వెంకటరమణ రాజీనామా చేశారు. దాదాపు మూడున్నరేళ్ల పాటు పదవీకాలం ఉంటుండగానే బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.