- పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యుల నిలదీత
- గ్రామీణ భారతం నిర్లక్ష్యం : వి శివదాసన్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు కేంద్ర బడ్జెట్ దేశంలోని సామాన్యులకు, రైతులకు హాని కలిగిస్తోందని విమర్శించారు. ఉభయ సభల్లో బడ్జెట్ చర్చ సందర్భంగా బీహార్, ఇతర రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ, కేరళతో సహా దక్షిణ భారత రాష్ట్రాలను విస్మరించారని విమర్శలు వచ్చాయి. రాజ్యసభలో జరిగిన చర్చలో సిపిఎం ఎంపి వి శివదాసన్ మాట్లాడుతూ.. వయనాడ్ ఇప్పటికీ కేరళకు కన్నీటి ధారగా మిగిలిపోయిందని, బడ్జెట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేస్తూనే ఉందని అన్నారు. వయనాడ్ భారత గణతంత్రంలో భాగం కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని విమర్శించారు. గ్రామీణ భారతదేశం నిర్లక్ష్యం చేయబడిందని అన్నారు. ప్రకటించిన ప్రాజెక్టుల్లో దేనికీ నిధులు కేటాయించలేదని, ఉపాధి హామీ పథకంలో ఎలాంటి పెరుగుదల ఉండటం లేదని అన్నారు. 2020-21కు కేటాయించిన ప్రాజెక్టుకు ప్రస్తుతం రూ.86,000 కోట్లు మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమవుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలు పెద్దయెత్తున అమ్మేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి ఇక డబ్బులు లేవని, పంటల బీమాకు కేటాయింపు తగ్గించారని అన్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించారని, దళిత, ఆదివాసీ స్కాలర్‌షిప్ పథకాలను తగ్గించారని పేర్కొన్నారు. సంక్షేమ పెన్షన్లలో ఎటువంటి పెరుగుదల లేదని శివదాసన్ అన్నారు. మంగళవారం బడ్జెట్ చర్చకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల మొదటి దశ గురువారం వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, మంగళవారం బడ్జెట్ సమాధానంతో ఇది ముగిసే అవకాశం ఉంది.
జనాభా లెక్కలు నిర్వహించాలి : రాజ్యసభలో సోనియాగాంధీ డిమాండ్
జనాభా లెక్కలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. దేశంలో దాదాపు 14 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ప్రయోజనాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. జనాభా గణనను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారులను 2011 జనాభా లెక్కల ప్రకారం గుర్తిస్తున్నామని, తాజా జనాభా సంఖ్యల ప్రకారం కాదని అన్నారు. 2013 సెప్టెంబర్‌లో యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ 140 కోట్ల భారతీయులకు ఆహారం, పోషక భద్రతను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన చర్యల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే లబ్ధిదారుల కోటా ఇప్పటికీ నిర్ణయించబడుతుందని తెలిపారు. ఈ ఏడాది జనాభా గణన నిర్వహించే అవకాశం లేదని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. వెంటనే జనాభా లెక్కలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.