న్యూఢిల్లీ : గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉన్నతాధికారులకు ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఒక మహిళను గ్రామ సర్పంచిగా తిరిగి నియమిస్తూ గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పంచాయతీ ప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించిన అనేక ఘటనలు ఇటీవల తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ”ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించిన రెండు, మూడు కేసుల్లో మేం తీర్పులు ఇచ్చాం. మహారాష్ట్రలో ఇలా తరచూ జరుగుతోంది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు ఉండాలి. గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వకూడదు” అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు పాత కేసులను బయటకు తీసేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. మహారాష్ట్రలోని రారుగఢ్ జిల్లా రోహా తాలుకాలోని ఐంఘఢ్ గ్రామ సర్పంచి కళావతి రాజేంద్ర కోకలేపై అనర్హత వేటు వేస్తున్నట్లు స్థానిక కలెక్టర్ గతేడాది ప్రకటించారు. అక్కడ కొత్తగా ఎన్నిక నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి నియమించారు. ఈ కేసుపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కలెక్టర్ ఆదేశం చట్టవిరుద్ధమని పేర్కొంటూ జులై 7, 2024న తీర్పు వెలువరించింది. తాజాగా దీనిని సుప్రీం కూడా సమర్థించింది.
