కార్చిచ్చు నియంత్రించడంలో ఉత్తరాఖండ్‌ తీరుపై సుప్రీం అసహనం

  • 17న హాజరుకావాలని సిఎస్‌కు ఆదేశం

న్యూఢిల్లీ : భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టడానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. అవసరమైన నిధులు సమకూర్చకపోవడంతోపాటు అటవీ అగ్నిమాపక సిబ్బందినీ ఎన్నికల విధుల్లో ఎందుకు నియమించారంటూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి రాష్ట్ర అధికారులు బదులిస్తూ ఏప్రిల్‌ 19న ఎన్నికల విధులు ముగిశాయని, తరువాత వారికి తదుపరి పోలింగ్‌ బాధ్యతలు అప్పగించొద్దని ముఖ్య కార్యదర్శి క ఆదేశించారని వివరణ ఇచ్చారు. ఇది చాలా విచారకరమని.. సాకులు మాత్రమే చెబుతున్నారంటూ అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహాం వ్యక్తంచేసింది.
భారీ స్థాయిలో కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. అవసరమైన అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించింది. నియామక ప్రక్రియ కొనసాగుతోందని, కార్చిచ్చులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మే 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తీరునూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ఉత్తరాఖండ్‌ అడవుల్లో భారీ సంఖ్యలో కార్చిచ్చులు చోటుచేసుకుంటున్నాయని.. దాదాపు 40శాతం అటవీ మంటల్లో చిక్కుకుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వీటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పిటిషన్‌దారులు విమర్శించారు. వీటిపై జస్టిస్‌ బీఆర్‌ గవారు, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీ, జస్టిస్‌ సందీప్‌మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.

➡️