న్యూఢిల్లీ : పంజాబ్ – హర్యానా రైతులు తాము పండించిన పంటకు ఎంఎస్‌పి (మద్దతు ధర)ని చట్టబద్ధం చేయాలని గతకొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర (ఢిల్లీ ఛలో మార్చ్)ను కూడా చేపట్టారు. అయితే రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది. రైతులపై పోలీసుల చేత భాష్పవాయుని ప్రయోగించింది. అక్రమంగా అరెస్టులను చేయించింది. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలను అడ్డుకోవద్దని తాజాగా పంజాబ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆందోళనలో భాగంగా రైతులు రైల్వే ట్రాకులను, జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్నారు. రైతుల ఆందోళనలను అడ్డుకోకుండా కేంద్రానికి, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అయితే సోమవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.