న్యూఢిల్లీ : మదరసాల విద్యను నియంత్రించే ఉత్తరప్రదేశ్ మదరసా ఎడ్యుకేషన్ బోర్డ్ చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. 2004 ఉత్తరప్రదేశ్ మదరసా ఎడ్యుకేషన్ బోర్డ్ యాక్ట్ లౌకికవాద సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. మతపరమైన బోధనపై చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా భారతదేశంలో ఎన్నడూ ఆంక్షలు లేవని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 23 మతపరమైన బోధనను గుర్తించిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను (మదరసాలలో) నియంత్రించగలదని, విద్యా ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు మదరసాల పరిపాలనలో జోక్యం చేసుకోవని ధర్మాసనం పేర్కొంది. మదరసాలలో విద్యా ప్రమాణాలను క్రమబద్ధీకరించేటప్పుడు, విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించే మైనారిటీ కమ్యూనిటీ హక్కును ప్రభుత్వం ఉల్లంఘించదని సుప్రీంకోర్టు తెలిపింది.