- ఉపా కేసు విచారణలో జాప్యంపై మొట్టికాయలు
నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కేసులో విచారణను ఆలస్యం చేయటం పట్ల ఎన్‌ఐఎ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుడికి త్వరిత విచారణకు హక్కు ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుడు జావేద్ గులాం నబీ షేక్ తీవ్రమైన నేరానికి పాల్పడినప్పటికీ.. ‘త్వరితగతిన విచారణ’ హక్కు ఆయనకున్నదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ వివరించింది. ‘న్యాయాన్ని అపహాస్యం చేయొద్దు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. ఆయన(నిందితుడు) తీవ్రమైన నేరం చేసి ఉండవచ్చు. కానీ విచారణ ప్రారంభించాల్సిన బాధ్యత మీకు ఉన్నది. గత నాలుగేళ్లుగా జైలులో ఉన్న ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు” అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, బొంబాయి వదిలి వెళ్లవద్దనీ, 15 రోజులలోగా ముంబయిలోని ఎన్‌ఐఎ కార్యాలయం ముందు హాజరుకావాలని నిందితుడిని ఆదేశించింది.