కొల్‌కతా : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత శాంతా సేన్ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌పై గత మూడేళ్లుగా ఫిర్యాదులున్నా.. సిఎం మమతాబెనర్జీకి ఆరోగ్య శాఖ పంపలేదు అని ఆయన ఆరోపించారు. దీంతో శాంతాసేన్‌ని అధికార పార్టీ ప్రతినిధి పదవి నుంచి టిఎంసి తొలగించింది. ఈ సందర్భంగా శాంతాసేన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీకి లేదా ఏ నాయకుడికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. నన్ను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించినట్లు మీడియా ద్వారానే తెలిసింది. ఫిరాయింపుదారులకు గౌరవం ఇస్తున్నారని, పార్టీకి అంకితమైన, నిజమైన సైనికులు ఇలాంటివి ఎదుర్కొవాల్సి ఉంటుంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించినా.. ఆ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన టిఎంసి నేత.. పార్టీ పదవి నుంచి తొలగింపు
