- ఎన్‌పిఆర్‌డి సంస్మరణ సభలో వక్తలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రొఫెసర్ సాయిబాబా పోరాటాలు కొనసాగుతాయని, అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. మానవ హక్కుల కోసం మాట్లాడినందుకు మోడీ ప్రభుత్వం పదేళ్లపాటు జైల్లో పెట్టడంతో చిత్రహింసలకు గురై, ఇటీవల మరణించిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) సోమవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో జరిగింది. మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, సాయిబాబా సహచరులు ఆయనను స్మరించుకున్నారు. ఆయన చేపట్టిన పోరాటాలు కొనసాగుతాయని సమావేశంలో మాట్లాడిన వారు తెలిపారు. ఎన్‌పిఆర్‌డి ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ.. దేశంలో లెక్కలేనన్ని విభిన్న సంస్థలున్నప్పటికీ సాయిబాబాకు అండగా నిలిచేది ఎన్‌పిఆర్‌డి ఒక్కటేనని గుర్తు చేశారు. సాయిబాబాతో భావోద్వేగ, వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయిబాబా లాంటి అనేక మందిని ఇప్పటికీ ప్రభుత్వం తప్పుడు కేసులుపెట్టి జైల్లో పెట్టిందని అన్నారు. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా మనసును జైలు నిర్వీర్యం చేయకపోయినా, ఆయన శరీరం తట్టుకోలేకపోయిందని సామాజిక కార్యకర్త హర్ష్ మందార్ వీడియో సందేశంలో తెలిపారు. సాయిబాబా వికలాంగుల ప్రజాసేవకుడని ప్రొఫెసర్ అమిత దండా గుర్తు చేసుకున్నారు. వికలాంగులను ఒంటరిగా కారాగారంలో బంధించడం దారుణమని అన్నారు. ఆయన సహచరురాలు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ (డియుటియు) మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ నందితా నారాయణ్ మాట్లాడుతూ.. సాయిబాబా నివాసంపై దాడి చేసి అరెస్టు చేయడం చట్టబద్ధమైనది కాదని, ఇది రాజ్యం చేసిన హత్య అని అన్నారు. సాయిబాబాతో పాటు ఏ ఒక్క వికలాంగుల సమస్యలను యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేషన్‌లు వినడం లేదని ప్రొఫెసర్ వికాస్ గుప్తా అన్నారు. యూనివర్సిటీ ఆయనకు ర్యాంప్ కూడా లేని ఇల్లు ఇచ్చిందని, సాయిబాబా కేసులో కోర్టులు కూడా అసాధారణ వైఫల్యం చెందాయని అన్నారు. మానవ అంతరిక్ష కార్యకర్త జాన్ దయాల్ కూడా సాయిబాబా లేవనెత్తిన ఆలోచనలు ఔచిత్యాన్ని పొందుతున్నాయని గుర్తు చేశారు. సభకు సీమా కాకర్ల అధ్యక్షత వహించారు. సాయిబాబా రచించిన పద్యాన్ని కూడా ఆలపించారు.