జమిలి ఎన్నికలపై సూచనలు, సలహాలకు వెబ్‌సైట్‌

న్యూఢిల్లీ : ఒక దేశం ఒక ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ త్వరలోనే ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజల నుండి సూచనలు, సలహాలను ఆహ్వానించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024, కేంద్ర పాలిత ప్రాంతాలు (సవరణ) బిల్లు, 2024లను పరిశీలిస్తున్న సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్‌, బిజెపి నేత పి.పి.చౌదరి మాట్లాడుతూ, కమిటీ పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని చెప్పారు. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడుడ రంజన్‌ గగోయ్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రాజేంద్ర మీనన్‌ల అభిప్రాయాలను కూడా ప్యానెల్‌ విందన్నారు. కమిటీ సభ్యులందరికీ వెబ్‌సైట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు చౌదరి చెప్పారు. 1952 నుండి 1967 వరకు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయని, ఆ తర్వాతే ఆ సైకిల్‌ విచ్ఛిన్నమైందన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు 1980ల నుండి వివిధ వర్గాల నుండి డిమాండ్లు వస్తున్నాయన్నారు.

➡️