నన్ను లక్ష్యంగా చేసుకోవడమే వారి ఉద్దేశం

  • కుమార్తెపై కేసుకు సంబంధించి పినరయి విజయన్‌

తిరువనంతపురం : ‘చట్టవిరుద్ధ చెల్లింపుల’కు సంబంధించిన కేసులో తన కుమార్తెపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) తీసుకుంటున్న చర్యను తాను కానీ, తన పార్టీ కానీ తీవ్రంగా పరిగణించడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అది తనపై ఏ విధంగానూ ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. తనను లక్ష్యంగా చేసుకోవడమే వారి ఉద్దేశమని, ఆ విషయం తనకు తెలుసునని చెప్పారు. ‘మీకు నా రక్తం కావాలన్న విషయం నాకు తెలుసు. కానీ దానిని మీరు అంత సులభంగా పొందలేరు’ అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎఫ్‌ఐఓ కేసు కోర్టులో ఉన్నదని, దానిని చట్ట ప్రకారమే ఎదుర్కొంటామని చెప్పారు. ప్రైవేటు మైనింగ్‌ కంపెనీ సిఎంఆర్‌ఎల్‌ నుండి పొందిన సొమ్ముపై తన కుమార్తెకు చెందిన ఐటి సంస్థ ఆదాయపు పన్ను, జిఎస్‌టి చెల్లించిందన్న వాస్తవాన్ని మీడియా విస్మరించిందని పినరయి తెలిపారు. చట్టవిరుద్ధ చెల్లింపుల కుంభకోణం కేసులో ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణను ఎదుర్కొంటున్న పినరయి కుమార్తెపై కేసు నమోదు చేసేందుకు ఇడి సన్నాహాలు చేస్తోందని వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐఓ కేసులో పినరయి కుమార్తెపై ప్రాసిక్యూషన్‌ చర్యలు చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

➡️