- సిపిఎం పొలిట్‌బ్యూరో ఘన నివాళి
- దోపిడీ రహిత సమాజం కోసం పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్ళాలని పిలుపు
న్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల పార్టీ పొలిట్‌బ్యూరో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పోరాడుతూ ఇక్కడి ఎయిమ్స్‌లో ఆయన గురువారం కన్నుమూశారు.
పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన ఏచూరి వామపక్ష ఉద్యమ విశిష్ట నేతల్లో అగ్రగణ్యులు. ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త కూడా. ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ రెండింట్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన తెలివైన విద్యార్ధి. 1974లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్ధి ఉద్యమంలో ఆయన చేరారు. ఆ తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడయ్యారు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే జెఎన్‌యు విద్యార్ధి సంఘం అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1984 నుండి 1986 వరకు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు. విద్యార్ధి సంఘాన్ని అఖిల భారత స్థాయిలో ఒక శక్తిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
1975లో సీతారాం ఏచూరి సిపిఎంలో చేరారు. ఆయన చేపట్టిన రాజకీయ కార్యకలాపాల కారణంగా ఎమర్జన్సీ సమయంలో అరెస్టయ్యారు. 1985లో పార్టీ 12వ మహాసభల్లో కేంద్ర కమిటీకి ఎన్నికైన ఆయన చివరి వరకు కొనసాగారు. 1989లో కేంద్ర కార్యదర్శివర్గానికి ఎన్నికయ్యారు. 1992లో పార్టీ 14వ మహాసభల్లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.
2015లో పార్టీ 21వ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి చివరి వరకు అదే పదవిలో కొనసాగారు. మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర పార్టీ నాయకత్వ బృందంలో భాగంగా ప్రతీసారీ పలు అంశాలపై పార్టీ రాజకీయ వైఖరులను రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించారు. సైద్ధాంతిక విభాగంలో సీతారాం ఏచూరి విశిష్టమైన పాత్ర పోషించారు. సోషలిజానికి ఎదురుదెబ్బలు తగలడంతో పార్టీ సైద్ధాంతిక వైఖరులను రూపొందించిన 14వ మహాసభల్లో నిర్దిష్టమైన సైద్ధాంతిక అంశాలపై పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కామ్రేడ్ సీతారాం ఏచూరి రూపొందించి మహాసభ ముందుంచారు. ఆ తర్వాత, 2012లో పార్టీ 20వ మహాసభల్లో సైద్ధాంతిక వైఖరులను సవరించిన తీర్మానాన్ని మొదటగా బలపరిచింది కూడా ఏచూరే. తదనంత రం ఆ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది.
పార్టీ కేంద్ర కమిటీ అంతర్జాతీయ విభాగాధిపతిగా ఏచూరి వివిధ అంతర్జాతీయ కమ్యూనిస్టు, ప్రగతిశీల శక్తుల వేదికలపై పాల్గొన్నారు. సోషలిస్టు దేశాలతో సంబంధాలను బలోపేతం చేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించారు.
పార్టీ వీక్లీ పీపుల్స్ డెమోక్రసీకి సంపాదకులుగా కూడా ఏచూరి రెండు దశాబ్దాల పాటు వ్యవహరించారు. ఆయన స్వయంగా మంచి రచయిత కూడా. సైద్ధాంతిక విభాగంలో ఆయన అందించిన ఇతర ప్రధానమైన సేవల్లో హిందూత్వపై ఆయన చేసిన విమర్శ ఒకటి. ఏచూరి రాసిన పుస్తకాలు – వాటీజ్ దిస్ హిందూ రాష్ట్ర?, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం- ల్లో ఇది ప్రచురితమైంది.
2005 నుండి 2017 వరకు రెండుసార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా వున్నారు. సిపిఎం గ్రూపు నాయకుడిగా వున్న ఆయన సమర్ధవంతమైన పార్లమెంటేరియన్. 2017లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
ఇటీవలి కాలంలో సీతారాం ఏచూరి, లౌకిక ప్రతిపక్ష పార్టీల మధ్య విస్తృత ఐక్యత కోసం తన సమయాన్ని, శక్తిని ప్రధానంగా వెచ్చించారు. అంతిమంగా అది ఇండియా బ్లాక్‌గా రూపుదిద్దుకుంది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో, తర్వాత వచ్చిన యుపిఎ ప్రభుత్వ కాలంలో ఈ సంకీర్ణాలకు మద్దతిచ్చిన సిపిఎం పార్టీకి కీలకమైన అనుసంథాన కర్తల్లో ఒకరిగా ఏచూరి వున్నారు.
ఏచూరికి వున్న స్నేహపూర్వక స్వభావం వల్ల అన్ని రాజకీయ పార్టీల్లో, అన్ని రంగాలకు చెందిన వారిలో ఆయనకు విస్తృత సంఖ్యలో మిత్రులు వున్నారు. ఏచూరికి వున్న రాజకీయ సమగ్రత, అంకిత భావం చూసి వారందరూ ఎంతగానో గౌరవించేవారు.
దేశ జాతీయ రాజకీయాలు కీలకమైన మలుపులో వున్న ఈ తరుణంలో సీతారాం ఏచూరి అకాల మరణం సిపిఎంకి పెద్ద ఎదురుదెబ్బ. మొత్త వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులకు తీరని నష్టం.
తమ ప్రియతమ సహచరునికి పొలిట్‌బ్యూరో ఘనంగా నివాళి అర్పిస్తోంది. ఆయన స్మృత్యర్ధం అరుణ పతాకాన్ని అవనతం చేశారు. దోపిడి రహిత సమాజం కోసం జరిపే పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు సమైక్యంగా, మరింత కఠోరంగా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పొలిట్‌బ్యూరో పిలుపిచ్చింది. అదే అయనకు మనం అందించగల ఉత్తమ నివాళి కాగలదని పేర్కొంది.
ఏచూరి భార్య సీమా, కుమార్తె అఖిల, కుమారుడు డానిష్, సోదరుడు శంకర్, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని పొలిట్‌బ్యూరో తెలియచేసింది.