- ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ : ఆయుర్వేదిక్, సిద్ధ, యునానీ ఔషధాల గురించి చట్టవిరుద్ధమైన రీతిలో వాణిజ్య ప్రకటనలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను సోమవారం పిలిపించిన సుప్రీంకోర్టు వారిని మందలించింది. తమ ఆదేశాలను అమలు చేయడానికి వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జస్టిస్ అభరు ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరించడానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు కావాల్సిందిగా బెంచ్ ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ వాదనలు వినిపిస్తూ, చాలా రాష్ట్రాలు క్షమాపణలను ఆమోదించాయని, ఉల్లంఘించిన వారిని నిర్దోషులుగా విడుదల చేస్తూ చర్యలు తీసుకున్నాయని తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్, 1945లోని 170వ నిబంధనను రాష్ట్రాలు సంపూర్ణంగా అమలు చేయడం ఆరంభిస్తే అమికస్ క్యూరీ చెప్పినట్లుగా ఆయుర్వేదం, సిద్ధం, యునాని ఔషధాల అక్రమ వాణిజ్య ప్రకటనల సమస్య గణనీయంగా పరిష్కరించబడుతుందని బెంచ్ పేర్కొంది. ఈ కోర్టు ఇందుకు సంబంధించి అనేక ఆదేశాలను జారీ చేసినా రాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. 170వ నిబంధన అమలుపై స్పందనతో సహా అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, జమ్ముకాశ్మీర్‌లను సుప్రీం ఆదేశించింది. ఇందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. మార్చి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది. తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు నిషేధించే 170వ నిబంధనను తొలగిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై గతేడాది ఆగస్టు 27న సుప్రీం స్టే విధించింది.