తగ్గేదే…లే!

  • 2004 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి
  • వరుసగా ఓడిపోతున్నా సరే

పాట్నా : బీహార్‌లోని ఓ స్వతంత్ర అభ్యర్థి 2004 నుంచి వరుసగా ఓడిపోతున్నా.. గెలుపుకోసం పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మళ్లీ పోటీ చేస్తూనే ఉన్నారు. తగ్గేదేలే అంటున్నారీయాన. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసే నియోజవర్గంలో ఇంటింటికీ గ్యాస్‌ సిలిండర్లు ఇస్తూ తనదైనశైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈ అభ్యర్థి పేరు ఛోటేలాల్‌ మహ్తో. కిషన్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఈయన 2004 నుంచీ ఇక్కడి నుంచి పోటీ చేయడం విశేషం. అందుకే మిస్టర్‌ ఎమ్మెల్యేగా ప్రసిద్ధి చెందారు. కుల రాజకీయాలు నడుస్తున్నా.. తాను మాత్రం కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగనని తేల్చి చెప్పారు. కేవలం స్థానికులతో తనకున్న వ్యక్తిగత సంబంధాల ద్వారా మాత్రమే ఓట్లను అడుగుతున్నట్లు మహ్తో తెలిపారు.
కాలినడకనే…
ఎన్నికల ప్రచారానికి మహ్తో మోటార్‌ సైకిల్‌ని కానీ ఇతర వాహనాల్ని కానీ ఉపయోగించడు. నడుచుకుంటూ వెళ్లడమో, సైకిల్‌పైనో వెళ్లి ప్రజలను కలుస్తానని చెబుతున్నాడు. 2000లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహ్తో అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అప్పటికి తన వయసు 25 ఏళ్లు నిండకపోయేసరికి ఆ నామినేషన్‌ తిరస్కరించబడింది. తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో అతనికి 11,479 ఓట్లు వచ్చాయి. ఎన్ని తడవలు అపజయం పాలైనా తాను గెలిచేవరకూ పోటీ చేస్తూనే ఉంటానని మహ్తో చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాడనే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని మహ్తో భార్య గీతా దేవి అన్నారు.
భార్య కోళ్లను పెంచుతుంది
ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ భార్యాభర్తలిద్దరూ నాలుగైదు సంవత్సరాలపాటు డబ్బు ఆదా చేస్తారు. బంధువులు, స్థానికుల నుండి విరాళాలు తీసుకుంటారు. నెలకు 15 వేల రూపాయలు సంపాదించే మహ్తో ఎన్నికల కోసం నాలుగు లక్షల కంటే ఎక్కువ ఖర్చుచేస్తారట. మహ్తో భార్య గీత కుటుంబాన్ని పోషించడం కోసం కోళ్లు, మేకల్ని పెంచుతుంది. నాలుగుసార్లు పోటీ చేసిన నాలుగుమార్లు మహ్తో గ్యాస్‌ సిలిండర్‌ గుర్తుపైనే పోటీ చేశారు.

➡️