ప్రత్యేక ట్రీట్‌మెంట్‌లేమీ లేవు !

May 17,2024 08:56 #Arvind Kejriwal, #supreem court
  •  కేజ్రివాల్‌ బెయిల్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ పట్ల ప్రత్యేకంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి అమిత్‌షా పరోక్షంగా చేసిన విమర్శలకు సుప్రీం దీటుగా బదులిచ్చింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు విషయంలో ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కోర్టు తేల్చి చెప్పింది. తమ తీర్పుపై విమర్శనాత్మకమైన విశ్లేషణలొస్తే తప్పక స్వీకరిస్తామని పేర్కొంది. కేజ్రివాల్‌ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు బెయిలు షరతులను ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ ఇడి చేసిన ఫిర్యాదును పరిశీలించిన సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ”ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు. మేం న్యాయమని అభిప్రాయపడినదాన్నే మా ఉత్తర్వుల్లో పేర్కొన్నాం” అని బెంచ్‌ పేర్కొంది.
బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, కేజ్రివాల్‌ బెయిల్‌పై విమర్శలు చేశారు. ఇది సాధారణంగా ఇచ్చే తీర్పులా లేదని, కేజ్రివాల్‌కు ప్రత్యేకంగా ట్రీట్‌ చేసినట్లు పలువురు భావిస్తున్నారని కేంద్ర హోం మంత్రి నోరు పారేసుకున్నారు.

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు ఊహ మాత్రమే : బెంచ్‌
ప్రజలు తనకు ఓటు వేస్తే తాను జైలుకు వెళ్లక్కరలేదన్నది కేవలం కేజ్రివాల్‌ ఊహ మాత్రమేనని జస్టిస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఆయన పాత్రపై చర్చించరాదని మాత్రమే తాము కోరామని చెప్పారు. కచ్చితంగా 20 రోజుల్లోగా కేజ్రివాల్‌ తిరిగి జైలుకు రావాలన్నది తమ ఆదేశాలని జస్టిస్‌ దత్తా స్పష్టం చేశారు. ప్రజలు ఆప్‌కు అనుకూలంగా తీర్పు చెబితే జూన్‌ 2 తరువాత జైలుకు వెళ్లాల్సిన పని ఉండదు అని కేజ్రీవాల్‌ అనడం వ్యవస్థను ధిక్కరించడమేనని ఇడి అంతకుముందు కోర్టులో ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, దీపాంకర్‌ దత్లాతో కూడిన ధర్మాసనం ముందు గురువారం ఇడి తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ‘ ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కేజ్రివాల్‌ తనకు తాను ప్రత్యేక వ్యక్తిగా ఊహించుకుంటున్నారని అన్నారు కేజ్రివాల్‌కు వ్యతిరేకంగా కోర్టులో విభేదాలు సృష్టించాలని ఇడి ప్రయత్నిస్తోందని కేజ్రివాల్‌ తరపు న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి విమర్శించారు. ఈ అంశంపై మెహతా అఫిడవిట్‌ దాఖలు చేస్తే తాము కూడా కేజ్రివాల్‌ బెయిల్‌ ఆదేశాలపై ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వున్న మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని సింఘ్వి తెలిపారు. తమ తీర్పుల గురించి ప్రజలు విమర్శనాత్మకమైన విశ్లేషణ జరిపినా తమకేమీ ఇబ్బంది లేదని జస్టిస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. మా తీర్పులు, ఆదేశాలపై ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు వుండొచ్చు, దాని గురించి మాకెలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.

➡️