ప్రజల ప్రాధమిక హక్కుల గురించీ ఆలోచించండి

ఇడిపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ : ప్రజల ప్రాధమిక హక్కుల గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కూడా ఆలోచించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. నాగరిక్‌ ఆపుర్తి నిగమ్‌ (ఎన్‌ఎఎన్‌) కుంభకోణం కేసును చత్తీస్‌గఢ్‌ నుండి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఇడి దాఖలు చేసిన పిటిషన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తుల కోసం ఉద్దేశించిన రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్‌ పిటిషన్‌ను మీరెలా దాఖలు చేస్తారంటూ ఇడిని జస్టిస్‌ అభరు ఓఖా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ ప్రశ్నించింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ రాజ్యాంగ పరిష్కారాల హక్కుకు హామీ కల్పిస్తుంది. తమ ప్రాధమిక హక్కులు ఉల్లంఘించబడినట్లైతే సుప్రీంకోర్టును పరిష్కారం కోరడానికి వ్యక్తులకు సాధికారత కల్పిస్తోంది. తమ హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీంను ఆశ్రయించేందుకు వారిని అనుమతిస్తోంది. సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు అనుమతి కోరారు. ఇడికి కూడా ప్రాథమిక హక్కులు వున్నాయని వ్యాఖ్యానించారు. ఇడికి ప్రాథమిక హక్కులు వుంటే అది ప్రజల ప్రాథమిక హక్కులు గురించి కూడా ఆలోచించాలని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి రాజును కోర్టు అనుమతించింది. చత్తీస్‌గఢ్‌లోని కేసులో మాజీ ఐఎఎస్‌ అధికారి అనీల్‌ తుటేజ తనకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను దుర్వినియోగం చేశారని ఇడి గతేడాది పేర్కొంది. చత్తీస్‌గఢ్‌లోని కొన్ని రాజ్యాంగ శక్తులు హైకోర్టు న్యాయమూర్తితో టచ్‌లో వుంటూ మనీ లాండరింగ్‌ కేసులోని నిందితులకు న్యాయపరమైన ఉపశమనం కలిగేలా చూస్తున్నారంటూ ఇడి ఇటీవల ఆరోపించింది. ఆ కేసును చత్తీస్‌గఢ్‌ నుండి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరింది.

➡️