కృత్రిమ మేథతో న్యాయవ్యవస్థకు ముప్పే !

  • జస్టిస్‌ గవాయ్ హెచ్చరిక

నైరోబి : కోర్టు తీర్పులను అంచనా వేయడానికి కృత్రిమ మేథస్సును ఒక సాధనంగా ఉపయోగించే ప్రయత్నాల పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలు, నైతిక తార్కికత లేని ఒక యంత్రం చట్టపరమైన వివాదాల సంక్లిష్టతలను, సూక్ష్మ నైపుణ్యాలను నిజంగా గ్రహించగలదా? అని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేథస్సును చొప్పించడమనేది చాలా జాగ్రత్తగా జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. అది కేవలం ఒక అదనపు సహాయంగా మాత్రమే వుండాలి తప్ప మానవ మేథస్సును, తీర్పును భర్తీ చేయదని అన్నారు. న్యాయం యొక్క సారం అనేది చాలా తరచుగా నైతిక పరిశీలనలు, సహానుభూతి, సందర్భోచిత అవగాహనలు వంటి పలు అంశాల సమాహారంగా వుంటుందని, అది అన్ని లెక్కలకూ అతీతంగా వుంటుందని అన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించడం అనే అంశంపై నైరోబిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కెన్యా సుప్రీం కోర్టు ఆహ్వానం మేరకు జస్టిస్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ ఐదు రోజుల పాటు కెన్యాలో పర్యటిస్తున్నారు. లీగల్‌ పరిశోధనకు ఎఐపై ఆధారపడడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులుకు దారి తీస్తుందన్నారు. దానివల్ల తీవ్రమైన ముప్పులు కూడా ఎదురవుతాయన్నారు. ఎఐతో పెద్ద మొత్తంలో లీగల్‌ డేటాను పరిశీలించవచ్చని, త్వరగా సమీక్షలు జరపవచ్చని అన్నారు. కానీ, మానవ వివేచనతో మూలాలను పరిశోధించే సామర్ధ్యం వుండదని హెచ్చరించారు.

➡️