ఈ ఎన్నికలు లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక రెఫరెండం!

రాహుల్‌ ప్రభావం ఏమీ వుండదు
సిఎఎ అమలును లౌకికవాద సమస్యగానే చూడాలి
మెతక హిందూత్వ ధోరణితో బిజెపిని నిలువరించలేం
అభివృద్ధి చెందిన దేశాల సరసన కేరళ
హిందూ ఇంటర్వ్యూలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

తిరువనంతపురం : ”ప్రస్తుతం జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలు భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంపై ఒక రెఫరెండం” అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలును వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) తీవ్రంగా ప్రతిఘటించడాన్ని మైనారిటీ లేదా మెజారిటీ సమస్యగా చూడడం తప్పని విజయన్‌ పేర్కొన్నారు. దానికి బదులుగా దీన్ని లౌకికవాదానికి సంబంధించిన సమస్యగా చూడాలని అన్నారు. మృదు హిందూత్వ ధోరణిని అనుసరించడం వల్ల మరింత దూకుడుతో వ్యవహరిస్తున్న బిజెపిని నిలువరించలేమని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల నుండి మితవాద పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపులు కలవరపరుస్తున్నాయని విజయన్‌ వ్యాఖ్యానించారు.
కేరళలోని 20 లోక్‌సభా నియోజకవర్గాల్లో 24 రోజుల పాటు పర్యటనకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2024 పార్లమెంటరీ ఎన్నికల కీలక స్వభావాన్ని ఆయన వివరించారు. శుక్రవారం ఇామెయిల్‌ ద్వారా ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
2024 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఎలాంటి ప్రభావం కనబరచలేరని అన్నారు. ఒక ఎంపీగా ఆయన పనితీరును వాయనాడ్‌ ప్రజలు సమీక్షిస్తారన్నారు. ఆయన పనితీరు గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్‌, బిజెపిలు చేసే నేరారోపణ ప్రచారాలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని కలిగించబోవన్నారు.

సిఎఎ అమలు గురించి కాంగ్రెస్‌ అసందిగ్ధతపైనే మీరు ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు కదా. సాంప్రదాయంగా యుడిఎఫ్‌ వైపున వుండే మైనారిటీ ఓటర్లను దీంతో ఎల్‌డిఎఫ్‌ లౌకిక, బిజెపి వ్యతిరేక ఎజెండా వైపునకు తీసుకురాగలగుతారా?
ఇది మైనారిటీ లేదా మెజారిటీ సమస్య కాదు, లౌకికవాదానికి సంబంధించిన సమస్య. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగానే కొనసాగాలా లేక ఆఫ్ఘనిస్తాన్‌ మాదిరిగా తమపరమైన రాజ్యాల సరసన నిలబెట్టాలా? అదీ అసలైన సమస్య. భారతదేశంలో ఆనాటి వలస పాలనకు వ్యతిరేకంగా మహోజ్వలంగా సాగిన స్వాతంత్య్ర సంగ్రామంలో అన్ని మత విశ్వాసాలకు చెందినవారు పాల్గని పోరాడారు. అలాగే ఏ మతాన్నీ విశ్వసించని వారు కూడా పోరాడారు. లౌకికవాద భారతదేశం కోసం వారు పోరు సల్పారు. అందువల్ల వారి మతపరమైన గుర్తింపు ప్రాతిపదికగా భారత పౌరసత్వాన్ని ఎవరికీ నిరాకరించరాదు. మేం ఓట్ల కోసం చూడడం లేదు. భారతదేశ లౌకికవాద గుర్తింపును పరిరక్షించడంపైనే మా దృష్టంతా వుంది.

కాంగ్రెస్‌ నుండి బిజెపిలోకి ఫిరాయింపులు ఎల్‌డిఎఫ్‌ను ఆందోళనపరుస్తున్నాయా? కేరళలో కాంగ్రెస్‌ విచ్ఛిన్నమయ్యేలా చూడడం ఎల్‌డిఎఫ్‌కి ప్రయోజనకరం కాదని మీరు పదే పదే చెబుతున్నారు కదా. ఎందుకు కాదో కాస్త మీరు వివరించగలుగుతారా? అటువంటి పరిస్థితి కేరళలో మితవాద పార్టీకి బలం పెరుగుతుందా?
ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని మతోన్మాద బిజెపి పాలనకు వ్యతిరేకంగా అన్ని లౌకికవాద, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని మేం భావిస్తున్నాం. అందువల్ల దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను బలహీనపడుతున్నాయంటే అది కచ్చితంగా ఆందోళన చెందే అంశమే. ప్రజలు లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల నుండి మతోన్మాద, నిరంకుశవాద పక్షాల వైపునకు మళ్ళినపుడు కచ్చితంగా అది మితవాద విభాగానికి బలం చేకూరుస్తుంది. మృదు హిందూత్వ విధానాలను అనుసరించడం ద్వారా బిజెపిని ఓడించడం సాధ్యం కాదు, రాజీలేని ధోరణిలో మతోన్మాద వ్యతిరేక రాజకీయ వైఖరిని అనుసరించడం ద్వారానే వారిని ఎదుర్కొనాల్సిన అవసరం వుంది.

వాయనాడ్‌ నుండి రాహుల్‌ గాంధీ అభ్యర్ధిత్వం వల్ల 2019లో మాదిరిగా యుడిఎఫ్‌ అవకాశాలు పెరుగుతాయని మీరు భావిస్తున్నారా? లేదా వంతెన కింద నీళ్ళ మాదిరిగా రాహుల్‌ ప్రభావం వుంటుందా?
అస్సలు ఎలాంటి ప్రభావం వుండదు. కేరళ నుండి ఎంపిగా ఆయన ఏం చేశారో ఆ పనితీరుపైనే ఆయనను అంచనా వేస్తారు. ఆయన నియోజకవర్గం వాయనాడ్‌ ప్రజలు లోక్‌సభలో ఆయన ఉనికి, పనితీరు గురించి సీరియస్‌గా ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా వారికి చెందినటువంటి కీలక సమస్యలపై అంటే మనుషులుావన్యప్రాణుల మధ్య ఘర్షణ, సిఎఎ, ఎన్‌ఐఎ, అయోధ్య వంటి అంశాలపై మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నిజంగానే బిజెపితో పోరు సల్పాలనుకుంటే, బిజెపి అభ్యర్ధులపై నేరుగానే పోటీకి దిగాలి. అగ్ర నేతలు కూడా బిజెపితో పోరుకు విముఖత చూపిస్తుంటే దేశ ప్రజలకు వారిచ్చే సందేశం ఏమిటి?

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వారిపై కేసులను ఉపసంహరించుకోవడం ద్వారా మీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, పైగా మైనారిటీల్లో భయాన్ని పాదుగొల్పడం ద్వారా మతం పేరుతో ఓటర్లను విభజిస్తున్నారని బిజెపి చేస్తున్న ఆరోపణలకు మీరు ఎలా స్పందిస్తారు?
ఏ కమ్యూనిటీలోనూ మేం భయాన్ని పాదుగొల్పడం లేదు. తమ హింసా, విద్వేష రాజకీయాలతో, విచక్షణాపూరిత విధానాలతో, సిఎఎ, ఎన్‌ఐఎ వంటి వాటిని వ్యాప్తి చేయడం ద్వారా భారత సమాజంలోని వివిధ వర్గాల మధ్య బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి భయం గొలుపుతోంది.

వ్యక్తిగతంగా మీపై యుడిఎఫ్‌, బిజెపిలు సాగిస్తున్న నేరారోపణ ప్రచారం కూడా ఇదే ధోరణిలో వుంటోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వారి వాదనలను ఓటర్లు తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ పాత ఆరోపణలను తవ్వడానికి యుడిఎఫ్‌, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయి. సిఎఎ, లౌకికవాదం, ఆర్థిక సమాఖ్యవాదంతో సహా కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లో ఇమిడివున్న పెద్ద సమస్యలను దృష్టిలో వుంచుకుంటే దీనికి ఏమైనా అవకాశాలు వున్నాయా?
ఏమీ వుండదు. తప్పుడు లక్ష్యాలతో వున్నారు. అంతే.

సిఎఎ, ప్రతిపక్షాలను, వారి ఆర్థిక లక్ష్యాలను బలహీనపరిచేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంతో సహా కీలకమైన అంశాలపై కాంగ్రెస్‌ ఒంటరిగా వెళ్ళడం ఇండియా బ్లాక్‌ ఉమ్మడి ప్రయోజనాన్ని జాతీయ స్థాయిలో ఎలా ప్రభావితం చేస్తుందని మీరనుకుంటున్నారు?
కాంగ్రెస్‌ పార్టీ దాని పనితీరు గురించి చాలామందికి వున్న విమర్శ ఇదే. ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా వారు ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవడంలో సమర్ధవంతమైన పాత్ర పోషించలేకపోతున్నారు. అదే సమయంలో, వారి పెద్దన్న వైఖరి కలిసి నిలబడాల్సినవారిని వేరు చేస్తోంది.

సిఎఎ గురించి చూసినట్లైతే, ఈ చట్టం అమలును నివారించడానికి కేరళకు చట్టపరంగా ఏమైనా అవకాశం వుందా, ఎందుకంటే అనేక బహిరంగ సభల్లో మీరు దీని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు గదా?
సిఎఎ అన్నది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పైగా రాజ్యాంగ మౌలిక వ్యవస్థ సిద్ధాంతానికి వ్యతిరేకం. అందువల్లే దాన్ని కోర్టులో సవాలు చేశాం. న్యాయ సమీక్ష ప్రకియ కొనసాగనివ్వండి, రాజ్యాంగ విరుద్దమైన, వ్యతిరేకమైన చట్టాన్ని అమలు చేస్తామని ఏ ప్రభుత్వమైనా ఎలా చెబుతుంది?
సవరణ చెల్లుబాటును సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం ఒక పిటిషన్‌ వేసింది. రూపొందించిన నిబంధనలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అడ్వకేట్‌ జనరల్‌ను కోరాం.

నవ్‌ కేరళ సదస్సు మీ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత సన్నిహితం చేసిందని మీరు భావిస్తున్నారా? ఆర్థిక సమాఖ్యవాదంపై దారుణమైన ఉల్లంఘనలు, కేంద్రం యొక్క ఘర్షణాయుత వైఖరి రాష్ట్ర అభివృద్ధికి, విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని ఓటర్లను మీ ప్రభుత్వం ఒప్పించగలిగిందా?
అవును, సంపూర్ణంగా చేయగలిగాం. కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షను మరింత ప్రశ్నించడాన్ని, ఇటువంటి వివక్షాపూరిత విధానాలను ప్రశ్నించని కేరళలోని ప్రతిపక్షమైన యుడిఎఫ్‌ను ప్రజలు విమర్శించడాన్ని మనం చూస్తున్నాం.

విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారా నడిచే ఆధునిక కేరళ పట్ల మీ దార్శనికత ప్రజలకు మీరు చేరువయ్యే సుస్థిరమైన అంశంగా వుంది. రాబోయే కాలంలో అక్షరాస్యత, అత్యంత నాణ్యతతో కూడిన జీవన సూచీలు కలిగిన కేరళ, నిపుణత్వం, ఉదారత్వం, లౌకికవాదానికి ఒయాసిస్‌గా ఆవిర్భవించగలుగుతుందని మీరు భావిస్తున్నారా?
నిస్సందేహంగా. అనేక అభివృద్ధి సూచీల్లో కేరళ ఇప్పటికే దేశానికి మార్దదర్శకత్వం వహిస్తోంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో అగ్ర భాగాన వుంది. అనేక విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన మేం వున్నాం. కేరళలో వున్న లక్షలాదిమంది గెస్ట్‌ వర్కర్లు వారి స్వంత రాష్ట్రాలతో పోలుస్తూ మా రాష్ట్రం గురించి ఏమంటున్నారో మేం చూస్తున్నాం. వారు ఇక్కడ మరింత మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు, అధిక ఆదాయాలు పొందుతున్నామని చెబుతున్నారు. అందువల్ల, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ, వినూత్న సమాజంగా ఆవిర్భవించే బాటలోనే కచ్చితంగా మేమున్నాం.

➡️