- రుతుపవనాలపై ఐఎండి అంచనా
న్యూఢిల్లీ : దేశంలో ఈ ఏడాది రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) అంచనా వేసింది. అలాగే ఈ కాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని పేర్కొంది. ఈ వివరాలను ఐఎండి చీఫ్ మృత్యుంజరు మోహపాత్ర న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నాలుగు నెలల రుతుపవనాల కాలంలో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. ఈ నాలుగు నెలల కాలంలో సగటును 87 సె.మీతో 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది’ అని మోహపాత్ర తెలిపారు. అలాగే, ఎల్ నినో పరిస్థితులు (సాధారణం కంటే తక్కువ వర్షపాతం) ఈసారి అభివృద్ధి చెందే అవకాశం లేదని చెప్పారు.
దేశంలో వ్యవసాయ రంగానికి రుతుపవనాలు చాలా కీలకమైనవి అనే సంగతి తెలిసిందే. దేశంలో దాదాపు 42.3 శాతం జనాభా వ్యవసాయంపై ఆధాపడి జీవిస్తున్నది. దేశ జిడిపిలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచి వస్తుంది. దేశంలో నికరసాగు విస్తీర్ణంలో 52 శాతం వర్షాధార వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. అలాగే విద్యుత్ ఉత్పత్తికి, తాగునీటికి కీలకమైన జలాశయాలను నింపడానికి కూడా రుతుపవనాలే ఆధారం. కాబట్టి ఈ వర్షాకాలంలో సాధారణ కంటే ఆధిక వర్షపాతం నమోదు కానుందనే అంచనా దేశానికి ఎంతో ఉపశమనం కలిగించే వార్తగా భావించవచ్చు.