ఆ వ్యాఖ్యలు ఆందోళనకరం

  • అలహాబాద్‌ హైకోర్టు జడ్జి ప్రసంగంపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌
  • భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ

న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి ఆమె లేఖ రాశారు. న్యాయ నిష్పాక్షికత, రాజ్యాంగ విలువల సూత్రాలను దెబ్బతీసేలా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఆ లేఖలో ఉటంకించారు. ”న్యాయవ్యవస్థలోని సీనియర్‌ సభ్యులు, చేసిన బహిరంగ ప్రసంగం గురించి మీ దృష్టికి తీసుకురావటం నా బాధ్యతగా భావించి మీకు లేఖ రాసే స్వేచ్ఛను తీసుకుంటున్నానని బృందా కరత్‌ పేర్కొన్నారు. ఈ ప్రసంగం మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీనిని చాలా మంది చూశారు. చదివారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లోనూ స్పందించారు. దాని ప్రభావం… ఆయన మాట్లాడినప్పుడు హాజరైన కొన్ని వందల మంది కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భారత ప్రధాన న్యాయమూర్తికి వాస్తవాలను తెలియజేయటం అత్యంతావశ్యకం. డిసెంబర్‌ 8న విహెచ్‌పి ఏర్పాటు చేసిన సమావేశానికి జస్టిస్‌ యాదవ్‌ హాజరయ్యారు. విహెచ్‌పి అధికారిక వెబ్‌సైట్‌ (విహెచ్‌పి.ఒఆర్‌జి).. ‘విహెచ్‌పి లక్ష్యం హిందూ సమాజాన్ని నిర్వహించడం, రక్షించడం, దానికి సేవ చేయడం’ అని తెలియజేస్తుంది. ఒక సెక్టేరియన్‌ సంస్థ కార్యక్రమానికి సీనియర్‌ న్యాయమూర్తి హాజరు కావడమనేది చాలా తీవ్రమైన అంశమని గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చే మొదటి విషయం.. న్యాయవ్యవస్థ ప్రవర్తనా నియమావళి. మతమార్పిడులు, యూనిఫాం సివిల్‌ కోడ్‌, వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు విహెచ్‌పి సమావేశం జరిగింది. న్యాయవ్యవస్థ సభ్యులు… కోర్టుల్లో, చట్టసభల్లో చర్చిస్తున్న విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించవచ్చా? అనేది రెండో అంశం.
మూడోది.. ముఖ్యంగా జస్టిస్‌ యాదవ్‌ చేసిన అసలు ప్రసంగం. నేను బార్‌ అండ్‌ బెంచ్‌ పోర్టల్‌ నుంచి తీసుకున్న ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను కింద ఇస్తున్నాను. నేను వివిధ వేదికలపై ప్రసంగపు అనేక భాగాలనూ విన్నాను. ‘ఇది హిందుస్థాన్‌ అని చెప్పటానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. ఈ దేశం ఇక్కడ నివసిస్తున్న మెజారిటీ కోరికల ప్రకారం నడుస్తుంది. ఇది చట్టం. ఇది హైకోర్టు న్యాయమూర్తిగా మాట్లాడటం కాదు. చట్టం బహుసంఖ్యాక్‌(మెజారిటీ)కు అనుగుణంగా పనిచేస్తుంది’ అని యాదవ్‌ అన్నారు. ‘మన దేశంలో, అన్ని జీవులను గౌరవించాలనీ, చిన్న జంతువులనూ గౌరవించాలనీ వాటికి హాని కలిగించకుండా ఉండాలని మనకు చిన్నప్పటి నుండి నేర్పించారు. అందుకే మనం మరింత సహనం, కరుణతో ఉంటాం. ఇతరులు బాధపడినప్పుడు బాధను అనుభవిస్తాము. కానీ ఇది అందరి విషయంలో కాదు. మన సంస్కృతిలో, పిల్లలను భగవంతుని వైపు నడిపించటం, వేద మంత్రాలు బోధించటం, అహింస విలువలతో పెంచుతాం. అయితే, కొన్ని ఇతర సంస్కృతులలో, పిల్లలు జంతువుల వధను చూస్తూ పెరుగుతారు. దీనితో, వారి నుంచి సహనం, కరుణను ఆశించటం కష్టమవుతుంది’ అని యాదవ్‌ తెలిపారు” అంటూ కరత్‌ తన లేఖలో వివరించారు.
ఆయన చేసిన ప్రసంగంలోని అభ్యంతరకరమైన విషయాలను ఆమె లేవనెత్తారు. ”గౌరవ ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు. ఈ ప్రసంగం (శేఖర్‌ యాదవ్‌ చేసిన ప్రసంగం) ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. ఆయనది ద్వేషపూరిత ప్రసంగం. రాజ్యాంగంపై దాడి. లౌకిక, ప్రజాస్వామ్య దేశ సామూహిక మనస్సాక్షికి అవమానకరం. ఇది అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి చేత చేయబడటమూ న్యాయ ప్రక్రియపై దాడి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా, మెజారిటీ దృక్పథానికి అనుకూలంగా పక్షపాతంతో, బహిరంగంగా వ్యక్తీకరించబడిన అభిప్రాయాన్ని ఒక సభ్యుడు కలిగి ఉన్న న్యాయస్థానంలో ఏ వ్యాజ్యకర్త కూడా న్యాయం కోసం ఆశించలేరు. అలాంటి సభ్యుడు ధర్మాసనానికి, న్యాయస్థానానికి, మొత్తం న్యాయ వ్యవస్థకే కళంకం తెస్తారు. న్యాయస్థానంలో అటువంటి వ్యక్తులకు చోటు ఉండదు, ఉండకూడదు. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం చర్య తీసుకుంటే.. దేశం కృతజ్ఞతతో ఉంటుందనటంలో సందేహం లేదు” అని బృందాకరత్‌ వివరించారు.

➡️