అదానీ ప్రాజెక్టుతో సరిహద్దు భద్రతకు ముప్పు

Mar 13,2025 00:05 #Adani project, #loksaba
  • లోక్‌సభలో నిరసన

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో భద్రతా ఏర్పాట్లను దెబ్బతీసేలా అదానీ గ్రూప్‌ ఇంధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై లోక్‌సభలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఇంధన ప్రాజెక్టుకు అనుమతించడం జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల వెలుపల మాత్రమే పెద్ద ప్రాజెక్టులకు అనుమతి ఉంటుందని భద్రతా ప్రమాణాలు పేర్కొంటున్నాయని, అయితే, ఈ నిబంధనను ఉల్లంఘించి గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌లో అదానీ గ్రూప్‌ ఇంధన ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం మర్మమేంటని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రతిపక్షం సభ నుండి వాకౌట్‌ చేసింది. వ్యూహాత్మక ప్రాంతంలో అదానీ గ్రూప్‌ సౌరశక్తి ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదంగా మారింది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టును సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)కి అప్పగించాలనేది ప్రణాళిక. అయితే, ప్రభుత్వం తరువాత ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కు అప్పగించాలని నిర్ణయించింది. దీనికోసం, జాతీయ భద్రతా ప్రోటోకాల్‌లో కూడా పెద్ద మార్పులు చేసింది. సరిహద్దు నుండి ఒక కిలోమీటరు దూరంలో టర్బైన్లను, రెండు కిలోమీటర్ల దూరంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఎప్పుడూ జాతీయ భద్రత గురించి మాట్లాడే బిజెపి, కేంద్ర ప్రభుత్వం సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు.

➡️