‘అవినీతి’ అధికారిపై నోట్లు విసిరి

  • గుజరాత్‌లో ఓ ఆఫీసర్‌పై జనాగ్రహం
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

గాంధీనగర్‌ : దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో లంచం ఒకటి. అవినీతికి దారి తీసే ఈ దుశ్చర్యపై ఎన్ని చట్టాలు చేసినా, వ్యవస్థను పటిష్టం చేసినా.. కొందరు అధికారుల్లో మాత్రం ఏ మాత్రమూ మార్పు రావటం లేదు. పైసలకు ఆశపడి లంచావతారులుగా మారుతున్నారు. ఇలాంటి ఒక అధికారిపై కొందరు ప్రజలు తిరగబడ్డారు. ప్లకార్డులను తమ మెడలకు తగిలించుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు అధికారి అవినీతి పరుడనీ, లంచాలు తీసుకున్నాడని ఆరోపించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా… కొందరు సదరు అధికారిపై నోట్లను విసిరి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గుజరాత్‌లో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. ప్రజలు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. సదరు అధికారి ఏమీ తెలియనట్టు చేతులు ముడుచుకొని ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఒక ఎక్స్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోకు ఐదు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అవినీతి అధికారిపై ప్రజలు తిరగబడటాన్ని చాలామంది నెటిజన్లు తమ కామెంట్లతో సమర్ధించారు.

➡️