న్యూఢిల్లీ : తిరుమల లడ్డూ వివాదంపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ … సుప్రీం కోర్టులో దాఖలైన పటిషన్లపై ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. లంచ్ సమయంలో కేసును విచారించనుంది. విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్‌ను అందుబాటులో ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది.
కోర్టు నంబర్ 3 లో ఐటెం నెంబర్ 63గా తిరుమల లడ్డు కేసు నమోదయ్యింది. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వివాదంలో నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలంటూ … సర్వోన్నత న్యాయస్థానాన్ని వైసిపి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆశ్రయించారు. ప్రసాద కల్తీపై చంద్రబాబు వ్యాఖ్యలపై వాస్తవాలు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బిజెపి సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. ఈ లడ్డు ప్రసాద కల్తీపై రచయిత విక్రమ్ సంపత్ సహా పలువురు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని పిటిషనర్లు విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీం కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకయ్యింది ? ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా ? అనేది కూడా తేల్చాలని పిటిషన్‌లో విన్నవించారు.