నేడు ‘జమిలి’ ప్యానెల్‌ తొలి భేటీ

Jan 8,2025 03:54 #'Jamili' panel, #First meeting

న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ తొలి సమావేశం బుధవారం జరగనుంది. జమిలి ఎన్నికల కోసం ప్రతిపాదించిన రెండు బిల్లులను పరిశీలించనుంది. ఈ బిల్లులపై న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ప్యానెల్‌ సభ్యులకు వివరించనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యాంగం (129వ సవరణ)బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలన కోసం ఈ ప్యానెల్‌కు పంపిన సంగతి తెలిసిందే. బిజెపి ఎంపి, కేంద్ర న్యాయ శాఖ మాజీ సహాయ మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో 39 మంది సభ్యులతో పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్‌ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, జెడి(యు) నుంచి సంజరు ఝా, శివసేన నుంచి శ్రీకాంత్‌ షిండే, ఆప్‌ నుంచి సంజరు సింగ్‌, టిఎంసి నుంచి కళ్యాణ్‌ బెనర్జీతో సహా ప్రధాన పార్టీల సభ్యులు ఉన్నారు. ముందుగా 31 మందితో ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసినా, తరువాత పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ సంఖ్యను 39కు పెంచారు. ఇందులో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఉన్నారు.

➡️