సార్వత్రిక ఎన్నికలు – తొలివిడత పోలింగ్‌ ప్రారంభం

Apr 19,2024 09:21 #2024 election
  • 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు
  •  అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన తొలివిడత పోలింగ్‌ ఘట్టం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను 102 లోక్‌సభ స్థానాలు ఈ తొలి విడత పోలింగ్‌లో ఉన్నాయి. వీటిలో 73 జనరల్‌ కేటగిరిలో ఉండగా, 11 ఎస్‌టి, 18 ఎస్‌సి రిజర్వ్‌ స్థానాలున్నాయి. వీటితోబాటు అరుణాచల్‌ ప్రదేశ్‌ (60), సిక్కిం(32) అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో 16.63 కోట్ల మంది ఓటర్లు 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. వీరిలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, తెలంగాణ మాజీ గవర్నరు తమిళిసై వంటి ప్రముఖులు ఉన్నారు. ఎన్నికలు సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 50 శాతానికిపైగా పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. 5 వేలకుపైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు, 1000 పోలింగ్‌ స్టేషన్లను వికలాంగులు నిర్వహించనున్నారు.. మొదటి దశ ఎన్నికలకు వెళ్తున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమిళనాడు (39), రాజస్థాన్‌ (12),ఉత్తర్‌ప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6) మహారాష్ర (5), అస్సాం (5), ఉత్తరాఖండ్‌ (5), బిహార్‌ (4), పశ్చిమ బెంగాల్‌ (3) అరుణాచల్‌ ప్రదేశ్‌(2), మణిపూర్‌ (2), మేఘాలయ(2) ఛత్తీస్‌గఢ్‌ (1), , మిజోరం(1), నాగాలాండ్‌ (1), సిక్కిం (1), త్రిపుర (1), అండమాన్‌ నికోబార్‌ (1), జమ్ముకాశ్మీర్‌ (1), లక్షద్వీప్‌(1), పుదుచ్చేరి (1) ఉన్నాయి.

➡️