Sixth phase పోలింగ్‌ ప్రారంభం

May 25,2024 09:07 #6th phase, #Polling
  • ఎనిమిది రాష్ట్రాల్లో 58 లోక్‌సభ స్థానాలకు
  •  ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు..
  •  11.13 కోట్ల ఓటర్లు.. 1.14 లక్షల పోలింగ్‌ కేంద్రాలు

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ఆరో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో 49 జనరల్‌, రెండు ఎస్టీ, ఏడు ఎస్సీ స్థానాలు ఉన్నాయి. 889 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అలాగే ఒడిశాలో పోలింగ్‌ జరిగే 42 అసెంబ్లీ స్థానాల్లో 31 జనరల్‌, ఐదు ఎస్టీ, ఆరు ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో మొత్తం 11.13 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5120 మంది ట్రాన్స్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు. 8.93 లక్షల మంది 85 ఏళ్లు పైబడినవారు, 23.659 మంది వందేండ్ల పైబడిన వారున్నారు. 9.58 లక్షల మంది వికలాంగ ఓటర్లున్నారు. 1.14 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 184 మంది పరిశీలకులు ఉన్నారు. అందులో 66 సాధారణ, 35 మంది పోలీసు, 83 వ్యయ పరిశీలకులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2,222 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 2,295 మంది స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌, 819 వీడియో సర్వేలెన్స్‌ టీమ్స్‌, 569 వీడియో వ్యూవింగ్‌ టీమ్స్‌ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. 927 అంతరాష్ట్ర, 257 అంతర్జాతీయ సరిహద్దుల చెక్‌ పోస్ట్‌ల వద్ద తనిఖీలు ఏర్పాటు చేశారు. 20 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఇసి తెలిపింది.

➡️