- సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన ఢిల్లీ సిఎం
- నేడు ఆప్ శాసన సభాపక్ష సమావేశంలో కొత్త సిఎం పేరు ఖరారు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. అక్కడ అధికార ఆప్ రాజకీయాలు చకచకా మారుతున్నాయి. నేడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కలుసుకునేందుకు ఎల్‌జి అనుమతించినట్టు ‘ఆప్’ వెల్లడించింది. ఈ సమయంలోనే తన రాజీనామాను కేజ్రీవాల్ సమర్పించనున్నారు. దీంతో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేజ్రీవాల్‌ను ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, రాఘవ్ చద్దా సోమవారం ఉదయం కలుసుకున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. పిఎసి సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను కేజ్రీవాల్‌కు తెలిపారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏకాభిప్రాయ అభ్యర్థి పేరును చర్చించనున్నారు. నేడు (మంగళవారం) శాసన సభాపక్ష సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం తీసుకుంటారని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఢిల్లీ మంత్రులు, పిఎసి సభ్యుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా కేజ్రీవాల్ తెలుసుకున్నారని చెప్పారు. మరోవైపు, కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించిన అతిషి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను అతిషి చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె, క్యాబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. ఇదే సమయంలో అతిషితోపాటు సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రారు, ఎంపీ రాఘవ్ చద్ధా పేర్లను ఆప్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది.