నేడు రామ్‌లల్లా ప్రతిష్ఠ – వందకుపైగా సోషల్‌ మీడియా అకౌంట్ల బ్లాక్‌

  • అయోధ్యలోబహుళంచెల భద్రత
  • తీర్పిచ్చిన ఐదుగురిలో నలుగురు న్యాయమూర్తులు దూరం
  • సెలవుపై వెనక్కి తగ్గిన ఎయిమ్స్‌

అయోధ్య : అయోధ్యలో సోమవారం రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు కేంద్ర భద్రత ఏజెన్సీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. భద్రతా ఏర్పాట్లలో భారీగా సాంకేతికతను వినియోగిస్తున్నట్లు అయోధ్య జిల్లా డైరెక్టర్‌ జనరల్‌ (డిజి, శాంతి భద్రతలు) ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి రహదారిపై రక్షణ కల్పించడంతో పాటు మొత్తం అయోధ్య జిల్లాను రెడ్‌ జోన్‌, ఎల్లో జోన్‌గా విభజించినట్లు చెప్పారు. కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బాంబ్‌ స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌, ఏఐ కెమెరాలతో భద్రతను పటిష్టం చేశామన్నారు. పది వేల సిసిటివిలు ఏర్పాటు చేశామన్నారు. కొన్ని సిసిటివిల్లో ఎఐ ఆధారిత టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, దీని ద్వారా యాత్రికులపై గట్టి నిఘా ఉంచవచ్చునన్నారు. రామమందిర ప్రారంభో త్సవ కార్యక్రమ వేదిక వద్ద బహుభాషా నైపుణ్యం కలిగిన పోలీసు సిబ్బంది సాధారణ దుస్తుల్లో మోహరిస్తారని చెప్పారు. సరయూ నది వెంబడి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాల సహాయంతో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాత్రికుల రద్దీని నియంత్రించడానికి, అదనపు రద్దీని మళ్లించడానికి డ్రోన్లను పోలీసు సిబ్బంది వినియోగిస్తారని చెప్పారు. ప్రారంభోత్సవానికి నలుగురు న్యాయమూర్తులు దూరంరామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులను ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అతిథులుగా ఆహ్వానించింది. వారిలో మాజీ ప్రధాన న్యాయమూర్తులు రంజన్‌ గొగోరు, ఎస్‌ఎ బాబ్డే, ప్రస్తుత సిజెఐ డివై చంద్రచూడ్‌, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొనడం లేదు. మాజీ న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ హాజరుకానున్నారు. వందకి పైగా సోషల్‌ మీడియా అకౌంట్లు బ్లాక్‌పాకిస్తాన్‌కి చెందిన సోషల్‌ మీడియా అకౌంట్లు విష ప్రచారానికి ప్లాన్‌ చేస్తున్నాయని, మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను లేదా అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను కేంద్ర హోం శాఖ ఇటీవల కోరింది. తప్పుడు కంటెంట్‌ వ్యాప్తి చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌) లకు సంబంధించిన వంద సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసింది. అయోధ్యకు చంద్రబాబు, పవన్‌మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన నాయకులు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు.ఎయిమ్స్‌లో హాఫ్‌ డే సెలవుపై వెనక్కు తగ్గిన యాజమాన్యం..!సోమవారం ప్రకటించిన హాఫ్‌ డే సెలవు నిర్ణయం నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌ వెనక్కు తగ్గింది. వైద్యుల అపాయింట్‌మెంట్లు తీసుకున్న రోగుల కోసం ఔట్‌ పేషంట్‌ విభాగం సోమవారం అంతా యథాతథంగా పని చేస్తుందని ఆదివారం జారీ చేసిన ఓ సర్క్యులర్‌’లో తెలిపింది. ఆల్‌ క్రిటికల్‌ క్లినికల్‌ కేర్‌ సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయని వివరించింది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎయిమ్స్‌ ఆసుపత్రిని సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ మూసి ఉంచుతామని ఎయిమ్స్‌ శనివారం ప్రకటించింది. ఎయిమ్స్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

➡️