- సంభాల్‌లో శాంతి సామరస్య పరిరక్షణకు చర్యలు
- యుపి పోలీసులు, జిల్లా అధికారులు తటస్థంగా వ్యవహరించాలి
- సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని :సంభాల్ మసీదులో సర్వే ఆపాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా తటస్థంగా వుంటూ, అక్కడ శాంతి భద్రతలు, సామరస్యాన్ని కాపాడాలని కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై విచారణను వచ్చే ఏడాది జనవరి6న చేపట్టేందుకు వీలుగా లిస్ట్‌లో చేర్చాలని న్యాయ సిబ్బందిని కోరింది. అంతవరకు ఎలాంటి సర్వేలు మసీదులో నిర్వహించరాదని తెలిపింది. దీనిపై రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ కావాలని పిటిషనర్లను సుప్రీం కోరింది. సంభాల్‌లో 16వ శతాబ్దానికి చెందిన మసీదులో సర్వే నిర్వహించాలని ఈ నెల 19న యుపిలోని స్థానిక సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆ ప్రాంతంలో ఆందోళనలు , ఘర్షణలు చెలరేగడం, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ముస్లిం యువకులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ అసాధారణ పరిస్థితి కారణంగా సుప్రీంకోర్టును నేరుగా మసీదు నిర్వహకుల కమిటీ ఆశ్రయించింది. సివిల్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు సర్వే ప్రక్రియ కార్యక్రమాలను నిలిపివేయాలని సివిల్ కోర్టును ఆదేశించింది. అలాగే, సివిల్ కోర్టు అడ్వకేట్ కమిషనర్ రూపొందించిన మసీదు సర్వే నివేదికను సీల్డ్ కవర్‌లో తమ ముందు ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజరు కుమార్‌లతో కూడిన బెంచ్ ఆదేశించింది. అలాగే, సర్వే నిర్వహించాలని లేదా ఆదేశాలు సవరించాలని ఈ నెల 19న సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలలపై అలహాబాద్ హైకోర్టును పిటీషనర్లు సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని 13వ నిబంధన ప్రకారం ఆశ్రయించ వచ్చునని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా చెప్పారు. కమిటీ దాఖలు చేసే పిటిషన్‌పై హైకోర్టు విచారించేవరకు ఎలాంటి కార్యకలాపాలను విచారణను సివిల్ కోర్టు చేపట్టరాదని బెంచ్ స్పష్టం చేసింది. అదేవిధంగా సివిల్ కోర్టు ఆదేశాలపై పిటిషన్ దాఖలైతే మూడు రోజుల్లోగా దానిని విచారణాంశాల జాబితాలో చేర్చాలని హైకోర్టు కోరింది. ఈలోగా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తూ వుంటుందని అధికారులు తెలుసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.