న్యూఢిల్లీ : బ్రిటీష్ మహిళ మంగళవారం (మార్చి 11) ఢిల్లీలోని మహిపాల్ పూర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో లైంగిక వేధింపులకు, అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో గురువారం ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఆ మహిళకు సోషల్ మీడియా స్నేహితుడని పోలీసులు తెలిపారు. తూర్పు ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువకుడి కోసం ఆమె గోవా నుంచి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలోని మహిపాల్ పూర్‌లోని ఓ హోటల్‌లో బస చేసిన ఆమెను మొదట హోటల్ హౌస్‌కీపింగ్ సిబ్బంది లైంగికంగా వేధించారు. ఆ తర్వాత సోషల్ మీడియా స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆ మహిళకు నిందితుడు నెలన్నర క్రితం సోషల్‌మీడియా ద్వారా పరిచయమయ్యాడని.. ఆ తర్వాత వారు తరచూ మాట్లాడుకున్నారు. ఆమె అతన్ని కలుసుకునేందుకు భారత్‌కు వచ్చింది. వారు ఢిల్లీలో కలిసేందుకు ముందుగా ప్లాన్ వేసుకున్నారు. ఆ మహిళ ముందుగానే మహిపాల్‌పూర్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుంది. అతన్ని కలుసుకునేందుకు గోవా నుంచి ఢిల్లీలోని హోటల్‌కు చేరింది. అయితే నిందితుడు ఆమెను హోటల్ రూమ్‌లో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు అని పోలీసు అధికారులు తెలిపారు.
