నితీష్‌ కుమార్‌ పార్టీకి రెండు కేబినెట్‌ పదవులు

Jun 8,2024 15:44 #modi, #Nitish Kumar, #two portfolios

న్యూఢిల్లీ :    ప్రధాని మోడీ నేతృత్వంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వంలో జనతాదళ్‌ (యునైటెడ్‌)కి రెండు కేబినెట్‌ పదవులు లభించనున్నాయి. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు లలన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌ల పేర్లను ప్రతిపాదించినట్లు శనివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌డిఎ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం అనంతరం కేబినెట్‌ పదవులు నిర్ణయించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

లలన్‌ సింగ్‌ బీహార్‌లోని ముంగర్‌ లోక్‌సభ స్థానం నుండి గెలుపొందగా, రామ్‌నాథ్‌ ఠాకూర్‌ రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. రామ్‌నాథ్‌ ఠాకూర్‌ బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ కుమారుడు. కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత రత్న ప్రకటించింది.

లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకున్న జెడియు రెండు కేబినెట్‌ పదవులను కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఎన్‌డిఎ కూటమిలో మరో కీలక మిత్రపక్షమైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాలుగు మంత్రిత్వ శాఖలు, పార్లమెంటరీ స్పీకర్‌ పదవి కోరినట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కావడంతో నితీష్‌ కుమార్‌, చంద్రబాబునాయుడులు కింగ్‌మేకర్‌లుగా మారిన సంగతి తెలిసిందే.

➡️