Jammu : ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్‌ :    జమ్మూకాశ్మీర్‌లోని అఖ్నూర్‌ సెక్టార్‌లో మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు  భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు.  నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) సమీపంలో 27 గంటల పాటు జరిగిన కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకి చేరుకుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌లో  భాగమైన అంబులెన్స్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ప్రత్యేక దళాలు, ఎన్‌ఎస్‌జి కమాండోలు, బిఎంపి -11 పదాతిదళాలు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం అఖ్నూర్‌ సెక్టార్‌లోని జోగ్వాన్‌ గ్రామం సమీపంలో ఆర్మీ, పోలీస్‌ బృందాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించాయని అధికారులు తెలిపారు. రెండు గంటల అనంతరం కాల్పుల్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు మరణించడంతో ఎన్‌కౌంటర్‌ ముగిసిందని పేర్కొన్నారు.

జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయని, గత రెండు వారాల్లో ఏడు ఎన్‌కౌంటర్‌లు జరిగాయని అధికారులు తెలిపారు. ఇద్దరు సైనికులతో పాటు 13 మంది మరణించారని అన్నారు.

➡️