తమిళనాడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

  • సెంథిల్‌బాలాజీ, మరో ముగ్గురు మంత్రుల ప్రమాణం
  • ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మూడు రోజుల క్రితం పుఝల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన డిఎంకె శాసనసభ్యుడు వి.సెంథిల్‌బాలాజీ ఆదివారం తమిళనాడు విద్యుత్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిఎంకె శాసనసభ్యులు ఆర్‌.రాజేంద్రన్‌, గోవి. చెజియాన్‌, ఎస్‌ఎం నాజర్‌ కూడా కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సెంథిల్‌బాలాజీ, నాజర్‌ గతంలోనూ మంత్రులుగా బాధ్యతలు నిర్వహిం చారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌. మురుగానందం,  ఉన్నతాధికారులు, ఉపముఖ్యమంత్రిగా శనివారం నియమితులైన ఉదయనిధి స్టాలిన్‌, అసెంబ్లీ స్పీకర్‌ తదితరులు హాజరయ్యారు. ఉదయనిధి ఇప్పటికే మంత్రిగా ఉన్నందున, డిప్యూటీ సిఎంగా నియమితులైనప్పటికీ, ఆయన ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. మంత్రులు చెజియాన్‌కు ఉన్నత విద్యా శాఖ, నాజర్‌కు మైనారిటీల సంక్షేమం, ప్రవాస తమిళుల శాఖ, రాజేంద్రన్‌కు టూరిజం శాఖలను సిఎం కేటాయించారు. మనీ లాండరింగ్‌ కేసులో ఇడి అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వి.సెంథిల్‌బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మూడు రోజుల క్రితం ఆయన విడుదల కావడంతో మళ్లీ మంత్రి పదవి దక్కింది.
ఉదయనిధి స్టాలిన్‌ తొలుత సినీ నిర్మాత, పంపిణీదారు, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం డిఎంకె తమిళ వార్తా పత్రిక ‘మురసోలి’ బాధ్యతలు చూశారు. 2019లో డిఎంకె యువజన విభాగం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎంకె స్టాలిన్‌ కూడా తొలుత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ తరువాత సిఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధికి డిప్యూటీ సిఎం బాధ్యతలు అప్పగిస్తారని చాలాకాలం నుంచి ప్రచారం జరగ్గా, తాజాగా ఆ బాధ్యతలు అప్పగించడం విశేషం.

➡️