చెన్నై : తమిళనాడు ప్రజలను, పెరియార్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే తమను అనాగరికులమని విమర్శించారో వారికి రాష్ట్ర ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ”కేంద్ర ప్రభుత్వం తమిళనాడును, పెరియార్‌ను అవమానిస్తోంది. మనం అనాగరికులమా ? వాస్తవానికి మమ్మల్ని అనాగరికులమని పిలిచేవారే అనాగరికులుగా ప్రవర్తిస్తున్నారు. మాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తమిళ ప్రజలు త్వరలోనే తగిన సమాధానం ఇస్తారు” అని అన్నారు.
తమిళనాడు అధికార డిఎంకె ఒకప్పుడు తమిళాన్ని అనాగరిక భాషగా కొట్టిపారేసిన వ్యక్తిని ఆరాధిస్తోందని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కజగం (టివికె) అధ్యక్షులు విజయ్ స్పందించిన సంగతి తెలిసిందే. తమపై విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికీ పెరియర్ రామస్వామి పేరును వాడుకుంటోందంటే తమిళనాడులో ఆయన్ను ఇప్పటికీ ఎంతగా ఆరాధిస్తున్నారో, ఆయనతో ఎంతగా అనుబంధం కలిగివున్నారో అర్థమౌతోందని విజయ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.