- వెంటనే ఉపసంహరించుకోవాలి
- బెంగళూరులో బిజేపియేతర రాష్ట్రాల విద్యా మంత్రుల తీర్మానం
బెంగళూరు : యుజిసి డ్రాఫ్ట్ నిబంధనలను బిజేపియేతర రాష్ట్రాల విద్యా మంత్రులు తీవ్రంగా విమర్శించారు. బెంగళూరులో బుధవారం జరిగిన బిజేపియేతర రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశంలో ఈ నిబంధనలకు వ్యతిరేకంగా 15 అంశాల తీర్మానాన్ని ఆమోదించారు. ముసాయిదాలో సవరణలు, ప్రతిపాదనలు సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రులు విమర్శించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది నియామకం, పదోన్నతికి సంబంధించిన నిబంధనలను మంత్రులు విమర్శించారు. కొత్త విద్యా విధానం 2020 ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు గ్రేడింగ్ ఇచ్చే ప్రక్రియను కూడా వ్యతిరేకించారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశం అనంతరం కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసి సుధాకర్ విలేకరులతో మాట్లాడారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా యుజిసి డ్రాఫ్ట్ నిబంధనలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి, బీహార్‌లోని జెడియు, లోక్ జనశక్తి పార్టీ ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ ముసాయిదాను పరిశీలించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఈ నిబంధనలు ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలతో సమిష్టిగా సంప్రదింపులు జరపాలని తీర్మానంలో కోరాం. కేంద్ర నిర్ణయం తరువాత, తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. ‘యుజిసి డ్రాఫ్ట్‌లో వైస్-ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు. పైగా గవర్నర్‌కు పూర్తి అధికారం ఇవ్వబడింది. నిజానికి విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, సిబ్బంది నియామకం, జీతం, ఇతర అంశాలతో సహా అన్ని విధులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి’ అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కర్ణాటకతోపాటు హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యవసర సమావేశాల కారణంగా జమ్ముకాశ్మీర్ మంత్రి పాల్గొనలేక పోయారని మంత్రి సుధాకర్ చెప్పారు.