Umar Khalid : సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలు : ఢిల్లీ పోలీసుల ఆరోపణ

న్యూఢిల్లీ  :    జెఎన్‌యు మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌   బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.  ఉమర్ ఖలీద్   సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలను పోస్ట్‌ చేశారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం అదనపు సెషన్స్‌ జడ్సి సమీర్‌ బాజ్‌పారు ఎదుట ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన వాదనలు వినిపించారు. ఈ వాదనపై ఖలీద్‌ తరపు న్యాయవాదులు నేడు వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఖలీద్‌కు పలువురు నటులు, కార్యకర్తలు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు ఆయన మెబైల్‌ ఫోన్‌లోని సమాచారం వెల్లడించిందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అమిత్‌ ప్రసాద్‌ తెలిపారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని న్యూస్‌ పోర్టల్స్‌ నుండి వారికి లింక్‌లు పంపారని అన్నారు. అల్లర్లపై కథనాన్ని పోస్ట్‌ చేసి, వాటిని సోషల్‌ మీడియా ఖాతాలలో పోస్ట్‌ చేయాలన్న అభ్యర్థనలతో ఈ లింక్‌లు వారికి పంపినట్లు తెలిపారు. కుట్రలో భాగంగానే ఖలీద్‌ ఈ కథనాలను వారికి పోస్ట్‌ చేశారని, వారితో చాట్‌ చేశారని న్యాయవాది పేర్కొన్నారు. ఖలీద్‌ తండ్రి న్యూస్‌ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కూడా కోర్టులో అమిత్‌ ప్రసాద్‌ ప్లే చేశారు.

సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం లేదని ఖలీద్‌ తండ్రి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. వారికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ట్రయల్‌ కోర్టుకు వచ్చినట్లు తనకు అనుకూలంగా కథనాన్ని సృష్టించారని పేర్కొన్నారు. విచారణ అనంతరం నిరసనలను షెడ్యూల్‌ చేయమని ఖలీద్‌ వాట్సప్‌ గ్రూప్‌ సభ్యులను కోరినట్లు ఆరోపించారు.

2020 అల్లర్ల కేసులో అరెస్టయిన ఖలీద్‌, సహా పలువురు ప్రధాన సూత్రధారులంటూ యుఎపిఎ సహా ఐపిసిలోని పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వివాదాస్పద సిఎఎకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో సుమారు 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయాలపాలయ్యారు.

➡️