అనుకోని ప్రధాని.. అరుదైన పురస్కారం..!

Feb 10,2024 10:41 #Awards, #PV Narasimha Rao

న్యూఢిల్లీ : దక్షిణాది నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు గడ్డ నుంచి దేశంలోనే సర్వశక్తివంతమైన ప్రధాని పదవిని అధిష్టించిన వ్యక్తిగా పాములపర్తి వెంకట నరసింహారావు (పివి నరసింహరావు) నిలిచారు. ఇది అనుకోకుండా జరిగిందే. ముందు నుంచి నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉన్న పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్ర హౌం, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖల మంత్రిగా పనిచేశారు. అప్పటికే ఎనిమిది ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 1991 నాటికి ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకొని ఎన్నికల్లో నిలబడలేదు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో రాజీవ్‌ గాంధీ దారణ హత్య తర్వాత అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. వివాదరహితుడు, అందరికీ ఆమోదయోగ్యుడు కావడంతో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. 1991 జూన్‌ 21న బాధ్యతలు స్వీకరించారు.

సోవియట్‌ యూనియన్‌ పతనం తరువాత మన దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పువచ్చింది. అది ఆర్థిక రంగంలోనూ మార్పులకు దారి తీసింది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం గావిస్తూ, స్వావలంబన కోసం పాటుపడాల్సింది పోయి ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పిజి) విధానాలకు పివి నరసింహారావు ప్రభుత్వం తెరలేపింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు ఉద్యోగి, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థికమంత్రిగా తీసుకొచ్చి ఈ దేశంలో కార్పొరేట్లకు, బడా వ్యాపారులకు అనుకూలంగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందుకుగాను పివిని అపర చాణుక్యుడని కార్పొరేట్‌ మీడియా ఆకాశానికెత్తింది. పివి నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వానికి మెజార్టీ చేకూర్చేందుకు పెద్దయెత్తున ఫిరాయింపులు ప్రోత్సహించాయి. అవినీతి కుంభకోణాలు కూడా అసాధారణ రీతిలో చోటుచేసుకోనారంభించింది ఈ సంస్కరణలు ప్రవేశపెట్టాకే. ప్రైవేటు కంపెనీలు తమకు అవసరమైనవి దిగుమతి చేసుకొనేలా స్వేచ్ఛను ఇచ్చింది. అలాగే 1991 బడ్జెట్‌కు ముందు.. కొత్త పారిశ్రామిక విధానాన్ని పీవీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటివరకు పరిశ్రమలకు, పెట్టుబడులకు ఇబ్బందిగా మారిన లైసెన్స్‌ విధానం నుంచి ఆర్థిక వ్యవస్థను దూరంగా తీసుకెళ్లింది. దీనికింద మోనోపోలిస్‌ అండ్‌ రిస్ట్రిక్టివ్‌ ట్రేడ్‌ ప్రాక్టీస్‌ యాక్ట్‌లో మార్పులు తెచ్చింది. వ్యాపారాల పునర్‌ వ్యవస్థీకరణ, విలీనం, కలయికలను సులభతరం చేసింది.

18 పరిశ్రమలు మినహా మిగిలిన వాటికి పెట్టుబడితో సంబంధం లేకుండా లైసెన్స్‌ల అవసరాన్ని తొలగించింది. బడ్జెట్‌తో పివి ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. ఆ తర్వాత కూడా మరో ఎనిమిది నెలల పాటు సంస్కరణల జోరును కొనసాగించింది. ఎగుమతులను ప్రోత్సహించడానికి సెకండ్‌ ట్రేడ్‌ పాలసీ, చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలను అందించింది. ఆర్థికరంగంలో సంస్కరణలను సూచించేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ ఎం.నరసింహన్‌ అధ్యక్షతన, ఆ తర్వాత పన్ను సంస్కరణల బాధ్యతలను ఆర్థికవేత్త రాజ చల్లయ్య అధ్యక్షతన రెండు కమిటీ ఏర్పాటు చేసింది.

రైతు బాంధవుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సామాన్య కుటుంబంలో చౌధరి చరణ్‌ సింగ్‌ 1903 డిసెంబర్‌ 23న జన్మించారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. తొలుత ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున చురుగ్గా వ్యవహరించిన ఆయన.. అక్కడి విధానాలు నచ్చక సొంత పార్టీ పెట్టుకున్నారు. 1967లో భారతీయ క్రాంతి దళ్‌ను స్థాపించారు. తర్వాత కాలంలో యూపీ సీఎంగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 1967 ఏప్రిల్‌ 3 నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకు తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ఆ ప్రభుత్వం ఏడాది తిరగకముందే కుప్పకూలింది. దీంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇందిర కాంగ్రెస్‌ మద్దతుతో 1970 ఫిబ్రవరి 18 నుంచి అదే ఏడాది అక్టోబర్‌ 1 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇందిర కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం మరోసారి కుప్పకూలింది. అప్పటివరకు యూపీ రాజకీయాలకే పరిమితమైన చరణ్‌సింగ్‌.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొరార్జీదేశారు మంత్రివర్గంలో కేంద్ర హౌంశాఖ, ఆయన హయాంలోనే 1979 జనవరి నుంచి జులై వరకు డిప్యూటీ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇందిర కాంగ్రెస్‌ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా చరణ్‌సింగ్‌ సేవలందించారు. ఇందిర కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు జరిగేంత (1980 జనవరి) వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.

రైతుల కోసం సంస్కరణలు..

రైతు కుటుంబంలో జన్మించిన చరణ్‌సింగ్‌కు వారి కష్టాల గురించి బాగా తెలుసు. అందుకే రైతుల కోసం, గ్రామీణ భారతం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వ్యవసాయం రూపురేఖలు మార్చిన ఘనత చరణ్‌సింగ్‌కే దక్కుతుంది. బ్రిటీష్‌ హాయంలో 1939లోనే రైతుల కోసం రుణ విముక్తి బిల్లును తీసుకొచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎంతోమంది రైతన్నలకు ఇది ఉపశమనం కల్పించింది. అన్నదాతల ఆత్మహత్యలను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. స్వాతంత్య్రం అనంతరం యూపీ తొలి సీఎం గోవింద్‌ వల్లభ్‌పంత్‌ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే జమిందారీ వ్యవస్థ నిర్మూలన చట్టం, ల్యాండ్‌ హౌల్డింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. భూస్వాముల చేతుల్లో మూలుగుతున్న భూమిపై పేదలకు హక్కులు కల్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు జీతాలు, ఇతర ప్రయోజనాల్లో భారీగా కోత పెట్టారు. 1980 జనవరి 14న ఆయన తుది శ్వాస విడిచారు.

ఐపిఎస్‌ కాదనుకుని….

మాన్‌కొంబు సాంబశివన్‌ స్వామినాథన్‌ (ఎం.ఎస్‌. స్వామినాథన్‌) తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7న జన్మించారు. అతనికి 15 ఏళ్లు నిండకముందే తండ్రి చనిపోవటంతో అప్పటికే కుటుంబం నిర్వహిస్తున్న ఆసుపత్రిని చూసుకొనేందుకు వైద్య విద్య చదవాల్సి వచ్చింది. కానీ, విద్యార్థిగా బెంగాల్‌లో దారుణ క్షామాన్ని చూసిన స్వామినాథన్‌, ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదని తపించారు. తాను వైద్యవృత్తిని చేపట్టబోనని కుటుంబానికి తేల్చి చెప్పి కోయంబత్తూరులోని మద్రాసు అగ్రికల్చర్‌ కాలేజీలో చేరారు. ప్రిన్సిపాల్‌ పిలిచి ‘మంచి మార్కులు వచ్చాయి. అనవసరంగా ఈ కోర్సులో ఎందుకు చేరాలనుకుంటున్నావు?’ అని స్వామినాథన్‌ను అడుగగా, ఆ సమయంలో అగ్రికల్చర్‌ కోర్సు చదవటమనేది నామోషీగా భావించేవారని, ఆ భావనను తొలగించేందుకే తాను ఇందులో చేరుతున్నానంటూ బదులు చెప్పారట .

1944లో మొదలైన స్వామినాథన్‌ వ్యవసాయ విద్యా ప్రస్థానం- జెనెటిక్స్‌లోకి, పంటలు, దిగుబడుల మెరుగుదల వైపు సాగింది. చీడపీడలను తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను తయారుచేస్తే రైతులకే కాకుండా యావత్‌ మానవాళికి మేలు జరుగుతుందనే తపనతో ఆయన అడుగులు వేశారు. పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, ఫెలోషిప్‌పై హాలెండ్‌లో వ్యవసాయ విద్యలో ఉన్నత చదువుకు అవకాశం రావడంతో అటువైపే మొగ్గు చూపారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధన చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ చేశారు. విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ అక్కడే మంచి జీతంపై అధ్యాపక పోస్టు ఆఫర్‌ చేసినా తిరస్కరించారు. 1954లో కటక్‌లోని ‘కేంద్ర వరి పరిశోధన సంస్థ’లో చేరి, తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థకు మారారు.

స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. విదేశాల నుంచి సరకు వస్తేగానీ పొట్ట నిండని పరిస్థితి. అమెరికా నుంచి గోధుమలను భారీగా దిగుమతి చేసుకునేవాళ్లం. 1960ల ఆరంభంలోనూ దేశంలో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. వరి దిగుబడి మరింత తక్కువ. 1966లో కరవు కారణంగా కోటి టన్నుల గోధుమల్ని అమెరికా నుంచి తెప్పించుకున్నాం. ఈ నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చాలని స్వామినాథన్‌ నడుం బిగించటంతో హరిత విప్లవానికి బీజం పడింది. అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీ, ట్రాక్టర్ల లాంటి ఆధునిక పరికరాల వాడకం, సాగునీటి సదుపాయాలు మెరుగుపరచటం, ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు విస్తీర్ణం పెంచటం ఈ హరిత విప్లవంలో ప్రధానాంశాలు. 1967-68 నుంచి 1977-78 మధ్య పరిస్థితిలో భారీ మార్పు మొదలైంది. వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్‌ జరిపిన విశేష కషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. అయితే హరిత విప్లవం కారణంగా రసాయనాలు, ఎరువుల వాడకం పెరిగి భూసారం తగ్గిందనే విమర్శలనూ అంగీకరించటం స్వామినాథన్‌ వినమ్రతకు నిదర్శనం. ”స్థానికంగా ఉండే వంగడాలను కోల్పోవద్దు. భూసారాన్ని కాపాడుకోకుండా, నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవసాయం చేస్తే ఎడారులను సష్టించినవారమవుతాం. హరిత విప్లవం కంటే సతత హరిత (ఎవర్‌గ్రీన్‌) విప్లవం కావాలి” అని ఆయన కోరుకున్నారు.ఎంతో శోధించి, పరిశోధించి రూపొందించిన వంగడాలతో భారత్‌లో బంగారు పంటలు పండించిన స్వామినాథన్‌.. వయోధిక కారణాలతో చెన్నై తేనాంపేటలోని స్వగహంలో 2023 సెప్టెంబర్‌ 28న తుదిశ్వాస విడిచారు.

➡️