- స్పీకర్‌తో భేటీలో ప్రతిపక్ష సభ్యుల ఫిర్యాదు
న్యూఢిల్లీ : వక్ప్ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్, బిజెపి ఎంపి జగదాంబికా పాల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ జెపిసిలోని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడిన తర్వాత ఆప్ ఎంపి సంజరు సింగ్, తృణమూల్ ఎంపి కల్యాణ్ బెనర్జీ, డిఎంకె ఎంపి ఎ.రాజా విలేకర్లతో మాట్లాడారు. తాము చెప్పినదంతా స్పీకర్ చాలా ఓపికగా విన్నారని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. తాము చెప్పిన అంశాలను స్పీకర్ పరిశీలిస్తామని హామీ ఇచ్చినందున జెపిసి సమావేశాలకు తాము హాజరవుతూనే వుంటామని వారు చెప్పారు. తమతోపాటు కాంగ్రెస్ సభ్యులు మహ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, ఎఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసి సంతకాలు చేసిన సంయుక్త మెమోరాండాన్ని ఎంపీలు స్పీకర్‌కు అందజేశారు. సభ్యులను సంప్రదించకుండానే సమావేశాల తేదీలను నిర్ణయిస్తారని, సాక్షుల సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు తమకు అసలు సమయం ఇవ్వడం లేదని వారు చెప్పారు. తమను పూర్తిగా పక్కకుబెడుతున్నందున ప్యానెల్ నుండి తాము దూరమవుతున్నామని చెప్పారు. ఛైర్మన్ పక్షపాత, ఏకపక్ష ధోరణి నేపథ్యంలో… అనేక అంశాలపై ప్రతిపక్ష సభ్యులు తరచుగా నిరసనలు వ్యక్తం చేయడంతో కమిటీ సమావేశాలు వాడిగా వేడిగా, గందరగోళంగా తయారవుతున్నాయి.