8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Trains cancell

– ఎపి, తెలంగాణలో ఒక ప్రాజెక్టు
– పిఎంఎవై-యు 2.0కి ఆమోదం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ, కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే మంత్రిత్వశాఖకు సంబంధించిన ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.24,657 కోట్లని పేర్కొంది. ఎనిమిది ప్రాజెక్టుల్లో ఒకటి మల్కన్‌గిరి – పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కిలోమీటర్ల మేర కొత్త మార్గం ఉంటుంది. ఇది తూర్పుగోదావరి, భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్‌గిరి (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా) జిల్లాలను కవర్‌ చేస్తుంది.
కొత్త లైన్‌ ప్రతిపాదనలు ప్రత్యక్ష కనెక్టివిటీని, ఇండియన్‌ రైల్వేలకు మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ను కవర్‌ చేస్తూ ఎనిమిది ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్‌ రైల్వే ప్రస్తుత నెట్‌వర్క్‌ మరో 900 కిలోమీటర్లు పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులతో 64 కొత్త స్టేషన్లు నిర్మాణం అవుతాయని, ఆరు వెనుకబడిన జిల్లాలకు భదాద్రి కొత్తగూడెం, రాయగడ, తూర్పుసింగ్‌బం, మల్కన్‌గిరి, కలహండి, నబరంగ్‌పూర్‌కు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని తెలిపింది. 510 గ్రామాలు, దాదాపు 40 లక్షల జనాభా వీటి పరిధిలోకి వస్తారని పేర్కొంది.
పిఎంఎవై-జి కింద మైదాన ప్రాంతంలో రూ.1.20 లక్షలు… హిల్స్‌ ప్రాంతంలో రూ.1.30 లక్షలు
2024-25 నుండి 2028-29 మధ్యకాలంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన – గ్రామీణ (పిఎంఎవై-జి) అమలు కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం కింద మైదాన ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌, ఈశాన్య రాష్ట్రాలు వంటి హిల్‌ స్టేట్స్‌, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రూ.1.30 లక్షలు అందించనున్నట్లు తెలిపింది. 2024-25 నుండి 2028-29 వరకు రెండు కోట్ల ఇళ్లు నిర్మాణానికి ఖర్చు చేసే రూ.3,06,137 కోట్లలో కేంద్ర వాటా రూ.2,05,856 కోట్లు, రాష్ట్ర వాటా రూ.1,00,281 కోట్లు ఉంటుందని తెలిపింది.
పిఎంఎవై-యు 2.0కి మంత్రివర్గం ఆమోదం
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ (పిఎంఎవై-యు) 2.0కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కింద రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఒక కోటి ఇళ్లు నిర్మాణాల కోసం పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో సరసమైన ధరతో ఇల్లు నిర్మించడం, కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం వంటివి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల ఖర్చు చేస్తుంది. పిఎంఎవై-యూ కింద 1.18 కోట్ల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 85.5 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించారు.
సిపిపి ఆమోదం
కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన హార్టికల్చర్‌ సమగ్ర అభివృద్ధి మిషన్‌ కింద క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ (సిపిపి)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,765.67 కోట్ల గణనీయమైన పెట్టుబడితో దేశంలో ఉద్యానవన రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. జీవ ఇంధనాల రంగంలో తాజా పరిణామాలకు అనుగుణంగా, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి జి-వ్యాన్‌ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

➡️