Union Cabinet: ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు

  • రూ.3,985 కోట్లతో మూడో లాంచ్‌ ప్యాడ్‌
  • కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
  • స్టీల్‌ప్లాంట్‌పై చర్చ!

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకొచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్నాయి. ఎనిమిదో వేతన సంఘం సిఫారసులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సి ఉంది. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులను నియమించనున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు, ట్రేడ్‌ యూనియన్లు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌ సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రూ.3,985 కోట్ల వ్యయంతో శ్రీహరికోటలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు అలాగే రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఎన్‌జిఎల్‌వి రాకెట్లు భారీ శాటిలైట్లను కక్ష్యలోకి మోసుకెళ్లగల సామర్థ్యం కలిగివున్నాయని ఆయన తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రివర్గంలో చర్చ..!

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలిసింది. స్టీల్‌ప్లాంట్‌ పునరుద్ధరణకు ఆర్థిక మద్దతు ఇచ్చే విషయమై చర్చ జరిగిందని, అది అప్పు రూపంలోనే ఇస్తారని తెలిపింది. అయితే, ఈ చర్చ గురించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ దీనిపై మౌనం వహించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విలేకరుల సమావేశం పెట్టాలని మొదట అనుకున్నా, అది జరగలేదు. బహుశా శుక్రవారం ఆయన పత్రికా గోష్టి నిర్వహించవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం.

➡️