ఉన్నావ్‌ బాధితురాలి తండ్రి హత్య కేసు

Jun 7,2024 23:58 #Delhi High Court, #judgement

– బిజెపి నాయకుడికి శిక్ష రద్దుకు కోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ : ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బిజెపి నాయకుడు కుల్దీప్‌ సెంగార్‌కు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ప్రస్తుత దశలో శిక్షను రద్దు చేయడానికి కోర్టు అనుకూలంగా లేదు, సెంగార్‌ పిటీషన్‌ను కొట్టివేస్తున్నామని జస్టిస్‌ స్వరణ కాంత శర్మ తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే 6 ఏళ్ల శిక్షను అనుభవించానని, మిగిలిన శిక్షను రద్దు చేయాలని సెంగార్‌ తన పిటీషన్‌లో కోరారు. దీనికి జడ్జి ‘శిక్షను రద్దు చేయడంపై నిర్ణయం తీసుకునే సందర్భంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరంలో దోషి పాత్ర వంటి అంశాలు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. కేవలం జైలుల్లో గడిపిన కాలం ఆధారంగానే నిర్ణయం తీసుకోం’ అని స్పష్టం చేశారు. అలాగే హత్యకు గురైన వ్యక్తి మైనర్‌ కుమారైపై అత్యాచారం కేసులో సెంగార్‌ ట్రయల్‌కోర్టులో దోషిగా నిర్థారించబడి, అతనికి జీవిత ఖైదును విధించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఉన్నావ్‌ అత్యాచార కేసులో ట్రయిల్‌ కోర్టు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ సెంగార్‌ వేసిన పిటీషన్‌ ఈ హైకోర్టులోనే విచారణలో ఉంది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరువాత 2018, ఏప్రిల్‌ 9న బాలిక తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. బిజెపి నాయకుడు సెంగార్‌ ఆదేశాల మేరకే బాలిక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని, పోలీసుల దెబ్బల కారణంగానే మృతిచెందాడని కోర్టు నిర్థారించింది. 2020, మార్చి 13న ఈ కేసులో ట్రయల్‌ కోర్టు సెంగార్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది.

➡️