నిర్బంధాన్ని ఎదిరించి మళ్లీ రోడ్డెక్కిన యుపి రైతులు

Dec 5,2024 00:32 #farmers, #Protest, #up
  • రైతుల ఆందోళనతో విడుదల
  • పోరు కొనసాగుతుంది: ఎస్‌కెఎం
  • యుపి ప్రభుత్వ అణచివేత చర్యలకు ఖండన

ప్రజాశక్తి న్యూఢిల్లీ బ్యూరో : న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని పచ్చి మితవాద బిజెపి ప్రభుత్వం ఎంతగా నిర్బంధాన్ని ప్రయోగించినప్పటికీ వాటన్నిటిని అధిగమించి వేలాది మంది రైతులు బుధవారం ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని తమ నిరసనను కొనసాగించారు. పట్టణీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో తమ నుంచి లాక్కున్న భూములకు పరిహారం చెల్లించడంలో వరుసగా ప్రభుత్వాల వైఫల్యంపై ఆగ్రహంతో ఉన్న రైతులు బుధవారం గ్రేటర్‌ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జీరో పాయింట్‌ వద్ద భారీ మహాపంచాయత్‌ను నిర్వహించారు. డిమాండ్లన్నీ సాధించే వరకు నోయిడా-ఢిల్లీ హైవేలోని దళిత్‌ ప్రేరణ స్థల్‌ వద్ద పగలు, రాత్రి ఆందోళన కొనసాగించాలని మహాపంచాయత్‌ నిర్ణయించింది. శాంతియుతంగా నిరసన తెలిపే వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించి మంగళవారం జైలులో పెట్టిన 160 మంది రైతులను విడుదల చేయాలని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. 16 గంటల తరువాత రైతు నేతలు, రైతులు, మహిళలు విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన రైతు నేతలను భుజాలపైకి ఎక్కించుకుని రైతులు వేదిక వద్దకు తీసుకెళ్లారు. విడుదలైన రైతు నాయకులు రూపేష్‌ వర్మ, సుఖ్‌బీర్‌ ఖలీఫా, సునీల్‌ ఫౌజీ తదితరులు మహాపంచాయత్‌లో ప్రసంగించారు. ఏడు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చి, దానికి భిన్నంగా రైతులను అరెస్టు చేసి జైలుకు పంపారని వారు విమర్శించారు. రైతులకు అనుకూలంగా 10 శాతం ప్లాట్లు, భూసేకరణ వల్ల కలిగే అన్ని ప్రయోజనాల్లోను రైతులకు తగు వాటా దక్కాలని, అంతకంటే తక్కువగా ఉండే ఏ ప్రతిపాదన రైతులకు ఆమోదయోగ్యం కాదంటూ హైపవర్‌ కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అవసరమైతే మళ్లీ ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. మహాపంచాయత్‌నుద్దేశించి ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ, దేశానికి తిండి పెట్టే రైతన్నను జైల్లో పెడతారా అంటూ యుపి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున తమ డిమాండ్లను గట్టిగా వినిపించడం కోసం యుపిలోని పల్లె పల్లె నుంచి వేలాది మంది రైతులు పార్లమెంటు మార్చ్‌కు భారీగా తరలివచ్చారు. ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టి అడ్డుకోవడానికి యత్నించిన భద్రతా దళాలతో వారు ఘర్షణకు దిగారు. ఢిల్లీకి వెళ్లకుండా మధ్యలో అడ్డుకోవడంతో రైతులు రాజధాని సరిహద్దుల్లో బైఠాయించాలని నిర్ణయించుకున్నారు.

ఎడిఎం అతుల్‌ కుమార్‌, యమునా అథారిటీ ఓఎస్‌డి శైలేంద్ర సింగ్‌, అదనపు పోలీసు కమిషనర్లు శివహర్మీనా, బబ్లూకుమార్‌ రైతులతో చర్చలు జరిపేందుకు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మహా పంచాయత్‌ స్థలానికి రాగా, రైతులు తమ సహచరులను బేషరతుగా జైలు నుంచి విడుదల చేసేంతవరకు ఎటువంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రైతు నేతలు పవన్‌ ఖతానా, సుఖ్‌బీర్‌ ఖలీఫా, రూపేష్‌ వర్మ, సునీల్‌ ఫౌజీ, వికాస్‌ ప్రధాన్‌, అమన్‌ ఠాకూర్‌, బాబీ నగర్‌, సుభాష్‌ చౌదరిని జైలు నుంచి విడుదల చేశారు.

టికాయత్‌ను అడ్డుకోవడం దుర్మార్గం: ఎస్‌కెఎం

అరెస్టు చేసిన రైతులను యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం విడుదలజేయడాన్ని నిరంకుశ పాలనపై ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా ఎస్‌కెఎం పేర్కొంది. నిర్భంధానికి వ్యతిరేకంగా యుపి రైతులు సాగించిన పోరాటం దేశవ్యాపితంగా ఉన్న రైతాంగానికి ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. మహాపంచాయత్‌కు రాకుండా ఎస్‌కెఎం నాయకుడు రాకేష్‌ టికాయత్‌ను అడ్డుకోవడాన్ని ఎస్‌కెఎం ఖండించింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించింది. రాకేష్‌ టికాయత్‌ను నేరస్తుడిలా వేటాడి, నిర్బంధించడం దారుణమని విమర్శించింది.
అత్యంత విలువైన భూములను, బతుకు తెరువును కోల్పోయినవారి బాధలను పట్టించుకోకుండా పోలీసులనుపయోగించి బలప్రయోగం ద్వారా పరిష్కరించాలనుకోవడం అవివేకమని ఎస్‌కెఎం పేర్కొంది.

దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం తమ నుంచి లాక్కున్న భూములకు తగు పరిహారం చెల్లించాలని, తమ కుటుంబాలకు మెరుగైన పునరావాస ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ రైతుల ఉమ్మడి పోరాట వేదిక ఎస్‌కెఎం ఈ ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఎస్‌కెఎంలో ఎఐకెఎస్‌తో సహా పది రైతులు సంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య నిర్వహించిన రైతుల చారిత్రాత్మక పోరాటానికి నాయకత్వం వహించిన ఎస్‌కెఎంలో ప్రధాన భాగస్వామ్య సంఘాలన్నీ యుపి ఎస్‌కెఎంలో ఉన్నాయి. యుపి రైతులు నిర్వహించిన ఈ ఆందోళన లక్ష్యాన్ని గురించి ఎఐకెఎస్‌ నాయకుడు పుష్పేంద్ర త్యాగి వీడియో సందేశం ద్వారా వివరిస్తూ, 2013 భూ సేకరణచట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నదే రైతుల ప్రధాన డిమాండని చెప్పారు. దీని కోసం గత కొన్ని నెలలుగా నొయిడాలో ఆందోళన చేస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్లపై పార్లమెంటు దృష్టి పెట్టేలా ఒత్తిడి తేవడం కోసం ఢిల్లీ మార్చ్‌ చేపట్టారని అన్నారు. డెవలప్‌ చేసిన ప్లాట్లలో కనీసం పది శాతం తమకు ఇచ్వాలని, భూ సేకరణలో పారదర్శకత, న్యాయమైన పరిహారం చెల్లింపునకు సంబంధించిన రైతుల హక్కును సరిగా అమలు చేయాలని వారు కోరుతున్నారని ఎఐకెఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, నొయిడా అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో బాటు రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా రైతులు కోరుతున్నారు.

1970లలో ఢిల్లీ శివార్లలో ఏర్పడిన నొయిడా (న్యూ ఓఖ్యాల ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చేపట్టిన అంచెలంచెలుగా విస్తరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో స్థానిక రైతులు పెద్దయెత్తున తమ వ్యవసాయ భూములను కోల్పోయారు.ఈ భూ సేకరణలో చాలా మంది రైతులు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఇచ్చిన అరకొర పరిహారం ఈ లోటును ఏమాత్రం భర్తీ చేయలేకపోయింది. దీంతో వారు పదే పదే రోడ్డెక్కాల్సి వస్తోంది. 2013 భూ సేకరణ చట్టం వచ్చాక తమ బాధలు కొంతమేరకైనా తీరుతాయని రైతులు భావించారు. కానీ, 2014లో యుపిలో బిజెపి ప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనలను వ్యతిరేకించింది. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పలు సవరణలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యత్నించింది. అయితే, రైతులు తిరగబడడంతో ఆ యత్నాలనుంచి వెనక్కి తగ్గింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేకూర్చడంలో యుపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్‌కెఎం విమర్శించింది. గతంలో వలస పాలన కాలం నాటి చట్టాలను ఉపయోగించి రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములకు పెద్దగా పరిహారం కూడా చెల్లించలేదని, దీనిపై రైతులు ఉద్యమించినప్పుడల్లా హామీలతో సరిపెడుతున్నదే తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదని ఎఐకెఎస్‌ పేర్కొంది. రైతుల డిమాండ్లు పూర్తిగా నెరవేరేంతవరకు ఢిల్లీ సరిహద్దును వీడి వెళ్లరాదని రైతులు గట్టిగా నిర్ణయించుకున్నారని ఎఐకెఎస్‌ ప్రకటించింది.

కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని, తిరోగమనంతో కూడిన నాలుగు కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్‌కెఎం , కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు నవంబరు26న దేశ వ్యాపితంగా నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

➡️