లక్నో : చంద్రునిపై రాకెట్లను ప్రయోగించేంతగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినా .. కొందరు బిజెపి నేతలు మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు. గతంలో గో మూత్రంతో కరోనాను నివారించవచ్చంటూ బిజెపి నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం.
ఆవుల షెడ్‌లో నివసించడం, శుభ్రం చేయడం వలన క్యాన్సర్ వ్యాధి నయమౌతుందని తాజాగా ఓ యుపి మంత్రి వ్యాఖ్యానించారు. పైగా ఆవు వీపుపై నిమరడం వలన రక్తపోటు తగ్గుతుందని ప్రకటించారు. యుపిలోని నౌగవా పకాడియాలో కన్హా ఆవుల షెడ్ (గోశాల) ప్రారంభోత్సవం సందర్భంగా యుపి మంత్రి సంజరు సింగ్ గాంగ్వార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రక్తపోటుతో బాధపడుతున్నవారు ఆవు వీపును రోజుకి రెండు సార్లు నిమరాలని, దీంతో పది రోజుల్లో వారి మందుల మోతాతు 20 ఎంజి నుండి 10 ఎంజికి తగ్గించగలదని పేర్కొన్నారు. ఆవు పిడకలను కాల్చడంతో వచ్చే పొగతో దోమలను నివారించవచ్చని అన్నారు. ఆవుల ప్రతి ఉత్పత్తి ప్రయోజనకరమేనని పేర్కొన్నారు.
తమ పొలాల్లోని పంటను మేస్తున్న పశువుల గురించి రైతుల ఆందోళనను ప్రస్తావిస్తూ.. వారికి ఆవుల పట్ల గౌరవం లేకపోవడం వలనే సమస్య ఉత్పన్నమవుతుందని అన్నారు.
గాంగ్వార్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్‌పి టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2017లో బిజెపిలో చేరి, పిలిభిత్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2022 ఎన్నికల్లో మరోసారి గెలవడంతో యోగి పభుత్వం మంత్రి పదవిని కట్టబెట్టింది.