50కి పైగా మదర్సాలకు సీల్‌ .. అధికార దుర్వినియోగం : ముస్లిం వర్గాలు

డెహ్రాడూన్‌ : రెండు వారాల్లో 50కి పైగా మదర్సాలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మూసివేయడాన్ని  ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  మదర్సాలపై సీల్‌ అధికార దుర్వినియోగానికి నిదర్శమని మండిపడ్డాయి.

ముస్లిం మతపరమైన విద్యా సంస్థలపై  దాడులను అధికార దుర్వినియోగంగా ముస్లిం సేవా సంఘటన్‌ అధ్యక్షుడు నయీమ్‌ ఖురేషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అక్రమ ఇసుక తవ్వకాలు, చెట్ల నరికివేత, అవినీతి వంటి సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు బిజెపి ప్రభుత్వం మైనారిటీలపై దాడికి దిగుతోందని అన్నారు. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, ఉద్యోగాలు లేవని అన్నారు. మదర్సాలకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మదర్సాలకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, ఒక్కో మదర్సాలో 2,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని ఖరేషి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు.

మార్చి 1 నుండి రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో దాదాపు 42 మదర్సాలను సీల్‌ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన పదింటిని నేపాల్‌ పొరుగునే ఉన్న ఉధమ్‌ సింగ్‌ నగర్‌లోని ఖతిమాలో సీల్‌ చేయబడినట్లు తెలిపాయి. కొన్నింటికీ రిజిస్ట్రేషన్‌ లేదని, ఇవన్నీ అక్రమ, అనధికారిక నిర్మాణాలుగా తేలినట్లు ఆరోపించాయి.  రాష్ట్ర సిఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుండి ముస్లిం విద్యాసంస్థల గుర్తింపు డ్రైవ్‌ చేపట్టామని తెలిపాయి. ఈ సంస్థలకు నిధులు అందించే వనరులను కూడా పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

➡️